Jun 08,2023 00:22

విచారణ నిర్వహిస్తున్న డిపిఒ

ప్రజాశక్తి-వేటపాలెం : వేటపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు డిపిఒ ఎ.రమేష్‌బాబు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేటపాలెం గ్రామ 115/2 సర్వే నెంబర్‌లో జిడుగు కోటేశ్వరరావు పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి టీకొట్టు నిర్మాణం చేపట్టినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఫిర్యాదు దారుడు నాయుడు నాగార్జునరెడ్డి, ఆరోపణ ఎదుర్కొంటున్న జిడుగు మస్తాన్‌రావును తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లుతో విచారణకు పిలిచినట్లు తెలిపారు. అయితే వారిద్దరూ సరైన ఆధారాలతో విచారణకు రాలేదన్నారు. వారి వద్ద నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకొని విచారణ వాయిదా వేసినట్లు తెలిపారు. మరో సారి ఇద్దరికి నోటీసులు జారీ చేసి విచారణ చేపడతామన్నారు. తొలుత డిపిఒ రమేష్‌బాబు వివాదస్పదమైన టీకొట్టును పరిశీలించారు.
పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం
పంచాయతీ స్థల ఆక్రమణపై విచారణ సందర్భంగా వేటపాలెం మున్సిపాలిటీగా ఉన్న సమయం, పంచా యతీగా ఉన్న కాలానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని పంచాయతీ సెక్రటరీ హరిబాబు చెప్పడంతో డిపిఒ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సంబంధిత రికార్డులు లేకపోవడంపై లిఖిత పూర్వకంగా సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా పంచాయతీ కార్యాయలం వద్ద ఉద్రిక్త వాతావరణం నేలకొంది. దీంతో నాయుడు నాగార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విచారణ అనంతరం పోలీసుల ప్రొడక్షన్‌తో నాయుడు నాగార్జునరెడ్డి బయటకు వెళ్లారు.