ప్రజాశక్తి-హిందూపురం: హిందూపురం రూరల్ మండలం చలివెందల గ్రామపంచాయతీ పోరులో ఇద్దరే మిగిలారు. నామినేషన్ చివరి రోజున ఐదుగురు బరిలో ఉండగా ఇందులో ఇద్దరు అదనంగా చెరువు సెట్ నామినేషన్ వేయడంతో మొత్తం 7 నామినేషన్లు మిగిలాయి. సోమవారం ఉపసంహరణ నేపథ్యంలో లక్ష్మీ నారాయణ రెడ్డి, మహేంద్ర రెడ్డి, వెంకటరెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పంచాయతీ సర్పంచి పోరులో వైసిపి బలపరుస్తున్న ఉపేంద్ర రెడ్డి, టిడిపి బలపరుస్తున్న రవీంద్ర రెడ్డి నిలిచారు. వైసిపి రెబల్ గా బరిలో ఉన్న మహేంద్ర రెడ్డిని గత రెండు రోజులపాటు అధికార పార్టీ నేతలు బుజ్జగించి, చివరకు హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్ష పదవి ఎర వేసి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారు. మహేంద్ర రెడ్డి ఒప్పుకోకపోవడంతో ఇన్‌ఛార్జి దీపిక తన లెటర్ ప్యాడ్ లో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మహేంద్ర రెడ్డిని ఉపాధ్యక్ష పదవిలో నియమించాలని రెకమెండ్ చేస్తూ లేఖను పంపడంతో ఆయన ఉపసంహరణకు అంగీకరించారు. మహేంద్ర రెడ్డి మనసు మారకముందే అతనితో కలిసి ఇన్‌ఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి, వైసిపి నాయకులు హనుమంత రెడ్డి, శ్రీరామిరెడ్డి తదితర నాయకులు మండల పరిషత్ కార్యాలయాలని వెళ్లి ఎన్నికల అధికారి కిష్టప్పను కలిసి నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నారు.










