Aug 19,2023 17:37

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
    గ్రామపంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లకు ఎపి ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం ద్వారా జీతాలు, ఉద్యోగాలకు రాబోతున్న ప్రమాదాన్ని తిప్పి కొట్టాలని జిల్లా అధ్యక్షులు బంగారు కృష్ణ తెలిపారు. మండల గ్రామ పంచాయతీ జనరల్‌ బాడీ సమావేశం ఎస్‌కె ఇస్మాయిల్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బంగారు కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, తదితర పథకాల అమలుకై ప్రభుత్వం జారీ చేసిన 132, 680 జిఒలు, టెండర్లు లేకుండా ఉద్యోగాల్లో కొనసాగించాలన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు పట్ల, హామీలు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఫణేంద్ర మాట్లాడుతూ తరతరాలుగా గ్రామపంచాయతీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కార్మికులకు హక్కులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌ జీతాలు వెంటనే కార్మికులకు చెల్లించాలని, లేని ఎడల పంచాయతీ కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంపేట, గవరవరం, పరింపూడి, సరిపెల్లి, తిప్పగాయలపాడు, కన్నాపురం, బోడిగూడెం, బయ్యనిగూడెం, రాజవరం, వేదాంతపురం, నరసన్నపాలెం, సీతంపేట గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.