ప్రజాశక్తి-ఫిరంగిపురం:గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నేతాజీ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన ఫిరంగిపురంలో సిహెచ్ రామారావు అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిరు ఉద్యోగులందరికీ రూ.10వేలు తక్కువ లేకుండా జీతం చెల్లిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందని, నాలుగేళ్లు పూర్తయినా నేటికీ అత్యధిక మంది గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.10వేలు జీతం అమలులోకి రాలేదని అన్నారు. కష్టించి పని చేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాల బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమని, జీతాల కోసం పదేపదే పోరాడాల్సి వస్తున్నదని అన్నారు. టెండర్ కార్మికుల రెన్యువల్ ఆర్డర్స్ నెలలు తరబడి ప్రతిపాదనలకు కూడా నోచుకోకపోవడం శోచనీయమని అన్నారు. సిఐటియు ఫిరంగిపురం మండల ప్రధాన కార్యదర్శి ఎస్.కె మస్తాన్వలి మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు యూనిఫారం, గుర్తింపు కార్డులు తదితర కనీస సౌకర్యాలు అమలు చేయాలని, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ప్రదర్శనగా ఎండిఓ కార్యాలయానికి వెళ్లి ఇంచార్జ్ ఈఓపిఆర్‌డికి సమస్యలు గురించి వివరించారు. బకాయి జీతాల చెల్లింపుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.










