ప్రజాశక్తి-చింతూరు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చింతూరు పంచాయతీ పారిశుధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 22న చేపట్టిన సమ్మె విజయవంతమైంది. మేజర్ గ్రామపంచాయతీ కార్మికులకు 6 నెలల నుండి 11 నెలల వరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేశారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ సమ్మె ప్రభావంతో పంచాయతీ కార్యదర్శి, సర్పంచు చర్చలకు దిగివచ్చారు. పంచాయతీ కార్మికుల వేతనాలు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పారిశుద్ధ కార్మికులు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ఉదయం లేచిన పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారని, అలాంటి వారికి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పోడియం లక్ష్మణ్, పంచాయతీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.










