Nov 15,2022 00:00

పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇస్తున్న వెంకట్‌, కార్మికులు

- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌
- పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీసు
ప్రజాశక్తి- చింతూరు

చింతూరు గ్రామ సచివాలయ పరిధిలోని పనిచేస్తున్న 13 మంది కార్మికులకు తక్షణమే 11 నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించకపోతే 22వ తేదీ నుండి విధులను బహిస్కరించి సమ్మె చేస్తామని సోమవారం సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని, కాని వారికి జీతాలు చెల్లించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. జీతాల మీద ఆధారపడి బతుకుతున్న కార్మికుల కుటుంబాలు నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోతే ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. పంచాయతీలో నిధులు లేవనే సాకుతో వేతనాలు చెల్లించకుండా ఉండటం సరికాదన్నారు. ఈ నెల 21వ తేదీలోగా వేతనాలు చెల్లించకుంటే 22 నుండి కార్మికులు సమ్మె చేస్తారని స్పష్టం చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ 21లోపు వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనందరాజు, రమేష్‌, రాములమ్మ, రాజమ్మ, శారదా, వెంకమ్మ, దుర్గ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.