Jul 17,2023 21:38

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ :  బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం పంచాయతీ కార్మికులు (గ్రీన్‌ అంబాసిడర్లు) ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ ఎన్‌.వై.నాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, జిల్లా కార్యదర్శి బి.వి.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 16 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రీన్‌ అంబాసిడర్ల జీతాలు చెల్లించే బాధ్యతను పంచాయతీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. గ్రీన్‌ అంబాసిడర్లకు పనిముట్లు ఇవ్వాలని, చెత్త సేకరణ బండ్ల మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన గ్రీన్‌ అంబాసిడర్ల కుటుంబాలకు 10 లక్షలు పరిహారం చెల్లించాలని, కార్మికులందరికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి అందించారు. కలెక్టర్‌ స్పందిస్తూ 15 రోజుల్లోగా పంచాయతీలకు నిధులు జమ కానున్నాయని, ఆ నిధుల నుండి మొదటి ప్రాధాన్యతగా కార్మికులకు బకాయి వేతనాన్ని పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మన్యం జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, యూనియన్‌ నాయకులు వెంకటనాయుడు, గౌరి, పకీరు, పైడయ్య, సుజాత, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.