Jul 10,2023 00:00

నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -కొత్తకోట:విదేశాలలో ఉంటూ సోషల్‌ మీడియా వేదికగా దళితులను కించపరుస్తూ హీనంగా మాట్లాడిన పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డిపై తక్షణమే సుమోటాగా ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రావికమతం మండలం కొత్తకోట అంబేద్కర్‌ సేవా సంఘం ప్రతి నిధులు బి.బుల్లిబాబు, పూడి దేవ తదితరులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విదేశాలలో ఉండి దళితులను కించ పరిచడం హేయమైన చర్య అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాయిబ్‌ అంబేద్కర్‌ దళితులకే కాదు అందరి విద్యకు తన మేధాశక్తిని పంచారన్నారు. చదువుకున్న అజ్ఞానిలా మాట్లాడిన ప్రభాకర్‌ రెడ్డి వైసీపీ పార్టీ సానుభూతి పరుడుగా చెప్పు కోవడం సిగ్గు చేటు అన్నారు. విదేశాలలో ఉండి కుల వివక్ష పై మాట్లాడటం ప్రభాకర్‌ రెడ్డి అవివేకం అన్నారు. మహాసేన రాజేష్‌పై ఉన్న రాజకీయ విభేదాలతో దళితులను నిందించడం తగదన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రభాకర్‌ రెడ్డి పై సుమోటా గా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముందుగా కొత్తకోట ఎస్‌సి కాలనీ -1 లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.