Aug 20,2023 23:56

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి-పెందుర్తి: పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం వేపగుంటలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి జివిఎంసి 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, సుమారు రెండు దశాబ్దాలపైబడి పంచ గ్రామాల సమస్య కొనసాగుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు వచ్చి వాగ్దానం చేయడం, తరువాత మర్చిపోవడం అనవాయితీగా వస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇళ్లకు చిన్న చిన్న మరమ్మతులు చేసుకునేందుకు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మన భూమిపై దేవస్థానం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో దేవస్థానం పీఠాధిపతులు కూడా పెత్తనం చెలయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానానికి 1966, 97లో ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దుచేయాలని, 193 సర్వే సెటిల్మెంట్‌ ఆధారంగా భూ హక్కు దారులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై పంచ గ్రామాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి.కృష్ణంరాజు, సిహెచ్‌ఎస్‌ గోపాలకృష్ణ, విబిఎన్‌.ప్రతాప్‌, బి.అరుణ్‌కుమార్‌, కెఆర్‌.ప్రసాద్‌, సిహెచ్‌.కోటేశ్వరరావు, ఎస్‌.రాజు, ఎస్‌వి.రమణ, వి.నారాయణరావు, కృష్ణారావు, శంకరరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.