ప్రజాశక్తి-సింహాచలం: పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాని కూడలి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు వచ్చి పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, అధికారం చేపట్టాక ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలను పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసదారులాగా చూస్తున్నారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. తక్షణమే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఇళ్ల నిర్మాణం, మరమ్మతులు, విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని డిమాండ్‌చేశారు. వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, లేకుంటే ప్రజలు సహనం కోల్పోయే అవకాశముందని తెలిపారు. శ్రీలంకలో పాలకులకు పట్టిన గతే ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పడుతుందని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు పార్టీలు మారేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల లేదని ఎద్దేవా చేశారు. ఈ సమస్య పరిష్కారాన్ని చొరవ చూపకపోతే ఈ ప్రాంతానికి వచ్చే ఎమ్మెల్యేలను అడ్డగిస్తామని హెచ్చరించారు. నగర మేయర్ ఈ సమస్యను కౌన్సిల్‌లో పెట్టి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని గతంలో మేయర్‌తో చర్చించామని తెలిపారు. ఈ సమస్యపై కౌన్సిల్లో తీర్మానానికి ప్రతిపక్ష కార్పొరేటర్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టీవీ కృష్ణంరాజు, బి.రమణి, సిహెచ్.గోపాలకృష్ణశాస్త్రి, సత్యనారాయణ, వివిధ కాలనీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, భూ సమస్య బాధితులు పాల్గొన్నారు.










