Sep 08,2023 00:00

సింహాచలం తొలి పావంచా నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-సింహాచలం
పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం సింహాచలం తొలి పావంచా నుంచి గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారాన్ని చేపడుతున్న ప్రభుత్వాలు తర్వాత కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవాచేశారు. కనీసం మరమ్మతులకు గురైన ఇళ్లను బాగుచేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మరమ్మతులు కోసం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందిస్తూ ఇళ్ల మరమ్మతులు చేసుకోవచ్చని తెలిపారని, కానీ ఆచరణలో మాత్రం దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారని వివరించారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు మరమ్మతులు చేసుకోకపోతే గోడలు పడిపోయే పరిస్థితి ఉందన్నారు.
బి.రమణి అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీలో నాయకులు టివి.కృష్ణంరాజు, సిహెచ్‌ఎస్‌ గోపాలకృష్ణ, విబిఎన్‌ ప్రసాద్‌, బి.అరుణ్‌ కుమార్‌, హెచ్‌.కోటేశ్వరరావు, ఎస్‌.రాజు, ఎస్‌వి.రమణ, వి.నారాయణరావు, కృష్ణారావు, బి.శంకరరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తదితరులతో పాటు వివిధ కాలనీలకు చెందిన బాధితులు పాల్గొన్నారు.