Jul 23,2023 00:28

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న టివి.కృష్ణంరాజు

ప్రజాశక్తి-సింహాచలం: పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాన కూడలి వద్ద బాధితులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి టీవీ కృష్ణంరాజు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని వైసిపి నాయకులు హామీ ఇచ్చి, అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ హామీని విస్మరించారని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపట్టేందుకు కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచ గ్రామాల భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి పంచగ్రామాల ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. దశాబ్దాల కాలంనాటి ఇళ్లు మరమ్మత్తులకు గురయ్యాయని, వాటి పనులు చేసుకుంటే దేవస్థానం సిబ్బంది అడ్డుకోవడం తగదని అన్నారు. మరమ్మతు పనులు అడ్డుకోకుండా దేవస్థానం సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంచ గ్రామాల సమస్యపై యథాస్థితి కొనసాగాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినందున ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలపై వారికి మరమ్మతులు, క్రయవిక్రయాలు, నిర్మాణాలకు అనుమతించాలని కోరారు. సింహాచలం దేవస్థానానికి 1996-97లో ఇచ్చిన పట్టాను వెంటనే రద్దు చేయాలని, 1993 సర్వే సెటిల్‌మెంట్‌ రికార్డు ఆధారంగా భూ హక్కుదారులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్య వల్ల సుమారు లక్ష మందికిపైగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రెండు పార్లమెంట్‌ స్థానాలు, ఐదు అసెంబ్లీ స్థానాలు, జివిఎంసిలో 17 కార్పొరేటర్‌ స్థానాలు ఈ సమస్య పరిధిలో ఉన్నాయని, దీన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. లేకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని బాధితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఎస్‌.గోపాలకృష్ణ, ప్రతాప్‌, ఈశ్వరరావు, అరుణ్‌కుమార్‌, కెఆర్‌కె.ప్రసాద్‌, ఎస్‌రాజు, ఎస్‌వి.రమణ, సిహెచ్‌.కోటేశ్వరరావు, ప్రకాష్‌, నారాయణరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.