
- రూ.12,900కు పడిపోయిన టన్ను ధర
- సాగు ఖర్చులకు, ధరకు లేనిపొంతన
- కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం
- తెల్లదోమ ప్రభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : పామాయిల్ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న తీరు పామాయిల్ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. సాగు ఖర్చులకు, ధరకు పొంతన లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో లక్షా ఎనిమిది వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఈ పంట సాగులో అత్యధికులు కౌలు రైతులే. గతేడాది అనూహ్యంగా టన్ను పామాయిల్ ధర రూ.23 వేలు పలికింది. దీంతో, ఒక్కసారిగా కౌలు ధరలు పెరిగిపోయాయి. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ కౌలు చేరింది. ఈ ఏడాది ఒక్కసారిగా టన్ను ధర రూ.12,900కు పడిపోయింది. ప్రసుత్తం ఇదే ధర కొనసాగుతోంది. టన్నుకు అమాంతం రూ.పది వేలు ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పామాయిల్ సాగులో ఎకరాకు ఎరువులు, కోత ఖర్చులు అన్నీ కలిపి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తెల్లదోమ సోకి ఆకులు నల్లగా మారిపోవడంతో ఈ ఏడాది దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు పది టన్నులకుపైగా రావాల్సిన దిగుబడి ఏడు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే వస్తున్నట్లు చెబుతున్నారు. ఎకరా పామాయిల్‌కు పెట్టుబడి, కౌలు కలిపితే దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది. ఏడు టన్నుల దిగుబడి వస్తే ప్రస్తుతం టన్ను ధర రూ.12,900 చొప్పున లెక్కిస్తే రూ.90,300 వరకూ వస్తోంది. ఎనిమిది టన్నుల దిగుబడి వచ్చినా రూ.లక్షా మూడు వేల వరకూ మాత్రమే ఆదాయం రానుంది. దీంతో, కౌలు రైతులు ఎకరాకు రూ.50 వేలు వరకూ నష్టపోతున్నారు. ఐదెకరాలు, పదెకరాలు కౌలుకు తీసుకున్న రైతులు రూ.లక్షల్లో అప్పుల పాలై దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
- తీవ్రంగా నష్టపోతున్నాం
ఐదెకరాల్లో పామాయిల్ సాగు చేశాను. సరాసరి ఎకరాకు రూ.ఎనిమిది టన్నుల దిగుబడి వచ్చింది. ఎరువుల నుంచి అన్నీ ధరలూ విపరీతంగా పెరగడంతో పెట్టుబడి భారీగా అయింది. ప్రస్తుత ధర వల్ల కనీసం సాగు ఖర్చులు కూడా రావడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
-బిక్కిన వీరసత్యం, పాములవారిగూడెం, జీలుగుమిల్లి మండలం
- దిగుబడి లేదు... ధరా లేదు
12 ఎకరాల్లో పామాయిల్ సాగు చేశాను. ఎకరాకు పది టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా తెల్లదోమ కారణంగా ఏడు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే వచ్చింది. అన్ని ఖర్చులతో కలిపి ఎకరాకు రూ.70 వేలకుపైగా పెట్టుబడి అవుతోంది. దిగుబడి, ధర తగ్గిపోవడం తీవ్రంగా దెబ్బతీసింది.
-కె.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రగడవరం గ్రామం, చింతలపూడి మండలం
- టన్నుకు కనీసం రూ.18 వేలు ఇవ్వాలి
పామాయిల్ పంటకు మద్దతు ధరను కేంద్రం ముందుగానే ప్రకటించాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ధర ఉండాలి. ఆయిల్ రికవరీ శాతం ఆధారంగా నిర్ణయిస్తున్న ధర అశాస్త్రీయంగా ఉంది. పెదవేగి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేయడం తగదు. ఈ ఫ్యాక్టరీని ఆధునీకరించారు. పామాయిల్‌కు కనీస మద్దతు ధర టన్నుకు రూ.18 వేలు ఉండాలి.
-కె.శ్రీనివాస్, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి