
స్వర్ణలతకు అరుదైన అవార్డు
ప్రజాశక్తి - పాలకోడేరు
విస్సాకోడేరు సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ డిఆర్.స్వర్ణలతకు మహాత్మగాంధీ జాతీయ అవార్డు లభించింది. గత 22 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఈ అవార్డును ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ తాడేపల్లిగూడెం డైరెక్టర్ రొక్కలా నాగబుజ్జి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని రేణుక ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలతను సొసైటీ సభ్యులు, సెయింట్ జాన్స్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ అవారు మరింత బాధ్యత పెంచిందన్నారు.
కన్నయ్యకు ఉత్తమ విఆర్‌ఎ అవార్డు
కాళ్ల :విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు కలవపూడి విఆర్‌ఎ బందెల కన్నయ్య స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విఆర్‌ఎ కన్నయ్యను తహశీల్దార్ టిఎ.కృష్ణా రావు, పలువురు రెవెన్యూ అధికారులు అభినందించారు.
ఉత్తమ ఎంపిడిఒగా మురళీగంగాధరరావు
పాలకోడేరు :పాలకోడేరు ఎంపిడిఒ నూకల మురళీ గంగాధరరావుకు నరసాపురం డివిజనల్ ఉత్తమ ఎంపిడిఒగా అవార్డు లభించింది. జెడ్‌పి ఛైర్మన్ పద్మశ్రీ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఒను ఆయన కార్యాలయంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి సత్యనారాయణరాజు మాట్లాడుతూ మరింత మెరుగైన సేవలు అందించాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం కార్యదర్శి బొల్లా శ్రీనివాస్, జంగం సూరిబాబు, పంచాయతీ కార్యదర్శులు పోలయ్య, లక్ష్మి, ప్రసాద్, రాజేష్, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
గోవిందరావుకు ఉత్తమ ఇఒ అవార్డు
పాలకొల్లు : పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఇఒ పిటి.గోవిందరావుకు స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉత్తమ సేవా పతాకం లభించింది. ఆలయ అభివృద్ధి, ఆలయానికి చెందిన బకాయిలు వసూలు చేయడంలో లక్ష్యాలు పూర్తి చేసిన నేపథ్యంలో కలెక్టర్ ప్రశాంతి చేతులమీదుగా ప్రశంసాపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ పానకాలు, ట్రష్టీలు ఆయనను అభినందించారు.
మ్యాజిక్ బోస్‌కు వందే విశ్వభారత్ వీర పురస్కారం
కాళ్ల : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను సత్కరించటమే ఆశయంగా విశాఖపట్నానికి చెందిన విశ్వభారత్ మీడియా సంస్థ కృషి మరువలేనిదని అవార్డు గ్రహీత దంతులూరి సత్యనారాయణరాజు (మ్యాజిక్ బోస్) తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 130 మంది స్వాతంత్య్ర సమరయోధులను ఒక వేదికపై ఘనంగా సత్కరించారన్నారు. కోపల్లె గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దంతులూరి కృష్ణంరాజు కుమారుడు ప్రత్యేక ఇంద్రజాలకుడు దంతులూరి సత్యనారాయణ రాజు (మ్యాజిక్ బోస్)కు వందే విశ్వభారత్ వీర పురస్కార్‌ను ఆ సంస్థ ఛైర్మన్ బలివాడ రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ భీమ్‌శెట్టి వాసుదేవి అందించారు.