Jul 27,2023 00:30

నక్కపల్లిలో రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు

ప్రజాశక్తి -గొలుగొండ:మండలంలోని పుత్తడిగైరంపేట పంచాయతీ పిఎన్‌డిపాలెం గ్రామానికి వెళ్లే రహదారి ఉధృతంగా కురుస్తున్న వర్షానికి కొట్టుకు పోయింది. గ్రామ సర్పంచ్‌ పత్తి రమణ మాట్లాడుతూ, ఈ రహదారి కొట్టుకుపోవడంతో పిఎన్‌డిపాలెంతో పాటు పెసరాడ, నాగేంద్రపాలెం, దిబ్బలూరు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయన్నారు. బుధవారం గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ, ఈ రోడ్డు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయన్నారు. ఈ సమస్య అత్యవసర సమస్యగా పరిగణించి ఎమ్మెల్యే ధృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పిడి, కలెక్టర్‌తో మాట్లాడి నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు
ఎస్‌:రాయవరం:మండలంలో సర్వసిద్ధి ప్రభుత్వ పాఠశాలలోనికి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం భారీగా కురిసిన వర్షానికి నీరు బడిలోనికి చేరడంతో చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోకి చేరిన నీరు దిగువ ప్రాంతానికి వెళ్ళేటట్లుగా అధికారులు దృష్టి చూపాలని తల్లిదండ్రులు కోరారు.
కోటవురట్ల:మండలంలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా ఉదయం నుండి వర్షం కురియడంతో ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. వర్షానికి పందూరు ఘాట్‌ రోడ్డు వద్ద నీరు నిలవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం వరి నారుమడులకు ఎంతో ఉపయోగమని రైతులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు.
కోటవురట్ల:ఇటీవల కురుస్తున్న వర్షాలకు పందూరు ప్రాంతానికి రాకపోకలు బుధవారం నుండి బంద్‌ అయ్యాయి. వరాహనది పొంగడంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకు పోవడంతో గ్రామస్తులు, విద్యార్థులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పొందూరు గ్రామానికి సంబంధించి విద్యార్థులు దార్లపూడి పాఠశాలలకు వెళ్లాలంటే పాత రోడ్డు మీదుగా పది కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రామచంద్రపురం గ్రామస్తులు పందూరు సచివాలయానికి రావాలన్న అవస్థలు తప్పదు. అదేవిధంగా గ్రామస్తులు మండల కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడాల్సిందే. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పందూరు గ్రామాన్ని పర్యటించారు. జూలై నెలలో పందూరు వంతెన పనులు ఎట్టి పరిస్థితుల్లో నైనా ప్రారంభిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.
నక్కపల్లి:మండలంలోని బుధవారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. ఆ సమయంలో రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నారుమడులకు ఊపిరి నిస్తుంని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.