పలుచోట్ల సిపిఎం సమరభేరి
ప్రజాశక్తి-కావలి రూరల్ : రాష్ట్ర సిపిఎం కమిటీ పిలుపు మేరకు ఆదివారం 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ, చెరువు కట్ట సంఘంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను పంచుతూ సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో నిత్యావసర వస్తువులు ధరలతో పాటు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఛార్జీలను అనేకసార్లు పెంచిందన్నారు. దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్ను, ఇతర యూజర్ ఛార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపడం జరిగిందని ఇది చాలా అన్యాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అదానీ, అంబానీల పాలను సాగిస్తూ ప్రజా కార్మిక వ్యతిరేక పాలలను కొనసాగిస్తూ ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారని పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.










