ప్రజాశక్తి-నక్కపల్లి:స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1976-77లో పాఠశాలలో చదువుకున్న పదో తరగతి బ్యాచ్ 45 సంవత్సరాల విరామం అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన నక్కపల్లి పాఠశాల వేదిక గా ఆదివారం కలుసుకున్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో స్థిరపడిన వారంతా చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. చిన్నతనంలో చేసిన అల్లరి, ఆడిన ఆటలు, గురువులు బోధించే తీరు అన్నీ ఒకసారి నెమరు వేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన వారిలో అత్యధిక మంది విశ్రాంత ఉద్యోగులే. వారంతా ఏ రంగాల్లో స్థిరపడ్డారు, పిల్లల చదువులు, ఉద్యోగాలు తదితర విషయాలు తెలియజేశారు. ఒకరికొకరు అండగా నిలవాలని, ప్రతి ఏడాది ఇలా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తమకు విద్య నేర్పిన ఎ.రంగసాయి మాష్టారు, కార్యాలయ సిబ్బంది కె.ప్రకాశరావులతో పాటు కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, తెలుగు ఉపాధ్యాయులు ఎన్‌విఎస్ ఆచార్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డివి రామారావు, ఎన్.గోపాలాచార్యులు, నరిశే వెంకటాద్రి, పోలసానపల్లి నూకయ్యశెట్టి, రావు గోపాలకృష్ణ, మంచాల రమణ, అల్లు సత్యనారాయణ, శ్రీధరాల నాగేశ్వరరావు, పచ్చిపులుసు హనుమంతరావు, అబ్ధుల్ అజీమ్ పాల్గొన్నారు.
మాకవరపాలెం: హైస్కూల్ 1987 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆదివారం వారందరూ రాచపల్లి కామేశ్వర గుడి వద్ద కలిశారు. ఆనాటి రోజుల్లో జరిగిన సంఘట నలను గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషాచలం, రమణ, అనిత పాల్గొన్నారు.










