ప్రజాశక్తి - భీమడోలు
సంక్రాంతిని పురస్కరించుకుని సాంప్రదాయం పేరుతో జూదాలు, కోడిపందేలు ఆడటం సరికాదని భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్ హితవు పలికారు. భీమడోలు పోలీసుల ఆధ్వర్యంలో పూళ్ల హైస్కూల్ గ్రౌండ్ వేదికగా క్రికెట్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ యువతలో ఉత్తేజాన్ని నింపేందుకు, వారు ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కాకుండా ఉండేందుకు పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలను సర్పంచి దాయం సుజాతప్రసాద్ ప్రారంభించగా వికెట్ కీపర్‌గా సర్పంచి భర్త దాయం ప్రసాద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీకి చెందిన పలువురు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
బొర్రంపాలెంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం
టి.నరసాపురం :మండలంలోని బొర్రంపాలెం లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ పోటీలను ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మండలంలోని బచ్చులేటిగూడెం, రామమ్మగూడెం, టి.నరసాపురం మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జూదం, కోడిపందెం, గుండాట వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.
చింతలపూడి : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తహశీల్దార్ కృష్ణజ్యోతి అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో టి.సురేష్ టీం చింతలపూడి సుప్రీంపేట విజేతగా, రామచంద్ర టీం బోయగూడెం రన్నర్‌గా నిలిచారు. ఈ పోటీలో ప్రతిభవంతు లకు మొదటి బహుమతి రూ.ఐదు వేలు, ద్వితీయ రూ.నాలుగు వేలు, మండల, డివిజన్ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతి రూ.పది వేలు, ద్విదీయ బహుమతి రూ.8 వేలు కలెక్టర్ చేతుల మీదుగా అందించనున్నట్లు తెలిపారు.
టోర్నీ విజేత ముదినేపల్లి పోలీస్11 జట్టు
ముదినేపల్లి :మండలంలోని గురజలో గత ఎనిమిది రోజులుగా ముదినేపల్లి పోలీసులు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిశాయి. మొత్తం 40 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్ ముదినేపల్లి పోలీస్ 11 , ముదినేపల్లి జట్టు మధ్య జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముదినేపల్లి జట్టుపై ముదినేపల్లి పోలీస్ 11 జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముదినేపల్లి పోలీస్ 11 జట్టు నిర్ణీత 12 ఓవర్లల్లో 44 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముదినేపల్లి జట్టు 43 పరుగులకే ఆల్‌ఆవుట్ అయింది. ఒక పరుగు తేడాతో ముదినేపల్లి పోలీస్ 11 జట్టు విజయం సాధించింది. విజేతలకు గురువారం కైకలూరులో జరిగే కార్యక్రమంలో ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ, ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు బహూమతులు అందిస్తారు. ముదినేపల్లి పోలీస్ 11 జట్టుకు కెప్టెన్‌గా ఎస్‌ఐ షణ్ముఖసాయి, ముదినేపల్లి జట్టుకు దివి సతీష్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ తనయులు దూలం ఆదివినరుకుమార్, ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, వైసిపి నేతలు పాల్గొన్నారు.










