ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమినరీ రాత పరీక్ష విశాఖ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విశాఖ రీజియన్‌లో 104 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహించారు. పురుషులు 41,434 మంది, మహిళలు 13,338 మంది మొత్తం 54,772 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు దరఖాస్తు చేసుకోగా పురుషులు 38,279 మంది, మహిళలు 11,969 మంది మొత్తం 50,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 91.74 శాతం హాజరు నమోదైంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదన్న నిబంధన ఉన్నప్పటికీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులను అనుమతించి వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహకరించారు. కొన్ని పరీక్షా కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ పరిశీలించారు. సబ్ డివిజన్‌లోని పరీక్షా ఏర్పాట్లును డిసిపి-1 సునీల్ సుమిత్ గరుడ్, జి.నాగన్న, డిసిపి-2 కె.ఆనందరెడ్డి, ఎడిసిపి (అడ్మిన్) ఎంఆర్‌కె.రాజు పర్యవేక్షించారు.
ప్రజాశక్తి- అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల్లో 9,827 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,297మంది పరీక్షలు రాశారని జిల్లా ఎస్‌పి గౌతమిశాలి వెల్లడించారు. అనకాపల్లి పట్టణంలో 11 కేంద్రాలు, చోడవరంలో ఐదు, మునగపాకలో రెండు, అచ్యుతాపురంలో రెండు, మాకవరపాలెంలో ఒకటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 530 మంది అభ్యర్థులు గైర్హాజరుతో 93.9 శాతం మంది హాజరైనట్టు ఎస్‌పి గౌతమిశాలి తెలిపారు.
పరీక్షలను పర్యవేక్షించిన ఎస్‌పి గౌతమిశాలి
అనకాపల్లిలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రాథమిక పరీక్ష కేంద్రాలను ఎస్‌పి గౌతమి సాలి పర్యవేక్షించారు. పట్టణంలో దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల, భాష్యం, డివిఆర్, హిమశేఖర్, సంయుక్త, సర్వేపల్లి, శ్రీచైతన్య, కెఎన్‌ఆర్‌ఎం, శ్రీ కన్య జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాలకు హాజరైన అభ్యర్థుల హాల్ టికెట్లను, గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే కేంద్రంలోని అనుమతించారు. ఎపిఎస్‌ఎల్‌ఆర్‌బి నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణపై ఇన్విజిలేటర్లకు, పోలీస్ అధికారులకు సూచించారు.పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల సీటింగ్, ఇతర సౌకర్యాలను సమీక్షించారు.
చోడవరం : పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షకు చోడవరంలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1810 మంది అభ్యర్థులకుగాను 1699 మంది పరీక్షలు రాశారు. 111మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద స్థానిక సిఐ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు కల్పించారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా తగు సూచనలు చేసేందుకు స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని, అడ్రసు తెలియని వారిని పోలీసులే బైకులపై స్వయంగా తీసుకెళ్లి పరీక్ష కేంద్రాల వద్ద దింపారు. పోలీసుల చర్యలపై కానిస్టేబుల్ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.
మాకవరపాలెం:మండలంలో తామరం అవంతి కాలేజీలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1483 మంది అభ్యర్థులకు గాను 1317 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.










