Sep 06,2023 21:02

కురుపాంలో కృష్ణుడు, గోపికల వేషాదరణలో చిన్నారులు

కృష్ణాష్టమి వేడుకలు జిల్లాలో ఘనంగా బుధవారం జరిగాయి. పలు విద్యా సంస్థల్లో చిన్నారులు కృష్ణుడి వేషాధరణలో అలరించారు. మరికొన్ని చోట్ల ఉట్టికొట్టే సంప్రదాయాన్ని కొనసాగించారు.
సీతంపేట :
మండలంలోని రామగిరి క్షేత్రం సమీపంలో గల భారతి ఇంటర్నేషనల్‌ స్కూల్లో బుధవారం శ్రీ కష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని వేషధారణలో పలువుర్ని ఆకట్టుకొనేలా దర్శనమిచ్చారు. కృష్ణుని అవతారంలో చిన్నారులు అధిక సంఖ్యలో వేషధారణలో పాల్గొని ఆట, పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఎస్‌.నవీన్‌ మాట్లాడుతూ కృష్ణుని జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. కృష్ణుని జన్మస్థలం, ఆయన చేసిన పనులు చిలిపి చేష్టలు విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో బోధకులు మురళీమోహన్‌, దివాకర్‌, సురేష్‌, మురళి, వెంకటేశ్వర్లు, పార్వతి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : మండల కేంద్రంలో గల సరస్వతి విద్యా నికేతన్‌ కాన్వెంట్లో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆహూతులను అలరించారు. సంప్రదాయబద్ధంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకుని ఉట్టి కొట్టే కార్యక్రమంతో ఆనంద హేళ మధ్య వేడుకలను ముగించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసేందుకే కాన్వెంట్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండల కేంద్రంలోని శ్రీ సాయి నికేతన్‌ హైస్కూల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉట్టి కుండను కొట్టేవారికి సాయినికేతన్‌ హైస్కూల్‌ యాజమాన్యం ప్రతినిధులు పక్కి సదాశివరావు, పెద్దింటి శ్రీధర్‌, చిగురువలస లీలాప్రసాద్‌, పెదిరెడ్డి శ్రీనివాసరావునాయుడు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రొంపిల్లి ఉదరు కిరణ్‌, బొంతాడ సత్యనారాయణ, ఇజ్జురోతు తాతినాయుడు, చందక అప్పలనాయుడు పాల్గొన్నారు.
సాలూరు: పట్టణంలోని రామాకాలనీ -3 అంగన్వాడీ కేంద్రం లో పిల్లలు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడు, గోపికల వేషధారణలతో పిల్లలు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం ఉట్టిని కొడుతూ పిల్లలు ఆనందించారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బి.రాధ ఆధ్వర్యాన నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు పిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.