ప్రజాశక్తి -యంత్రాంగం
ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని విశాఖ జిల్లాలో పలుచోట్ల శనివారం ఘనంగా నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక కుమ్మరిపాలెం ప్రకృతి స్కూల్‌లో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వడలి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై మరింతగా అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. కిడ్ పవర్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పలు అంశాలపై విద్యార్థులకు చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. నాటిక ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ కిడ్ పవర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిడ్ పవర్ సంస్థ కో ఆర్డినేటర్ నగేష్, ఇన్‌ఛార్జి పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మధురవాడ : ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యాన నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ పర్యావరణశాస్త్ర విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో సైన్స్ కోర్సుల డీన్ ప్రొఫెసర్ కెఎస్.కృష్ణ మాట్లాడుతూ పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న క్లోరో ఫ్లోరో కార్బన్ ఉద్గారాలు భూగ్రహన్ని మరింతగా వేడెక్కిస్తున్నాయని, దీని వల్ల పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకొని జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ధరిత్రిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎ.శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










