ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి విచ్చేసిన కేంద్ర మంత్రి మురళీధరన్‌కు పలు సమస్యలపై వినతులు అందాయి. వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరణ, క్రషింగు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఇక్కడి రైతులు, కార్మికులను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ సుగర్స్ నుంచి సహకారం అందించి ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో దొడ్డి సత్య అప్పారావు, పీల జగ్గ సత్యనారాయణ ఉన్నారు.
అపరిష్కృత సమస్యలపై
రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సామాజిక ఉద్యమ నాయకులు బాలు గాడి కేంద్ర మంత్రి మురళీధరన్‌కు వినతిపత్రం అందజేశారు. ఎపిలోని షెడ్యూలు 5లో కలపకుండా 554 పూర్తి ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, దీంతో ఆ గ్రామాల గిరిజనులు ప్రత్యేక హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని, వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని కోరారు.
వికలాంగుల సమస్యలపై...
వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర మంత్రి మురళీధరన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పాత్రపల్లి వీరు యాదవ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వికలాంగుల సంక్షేమ చట్టం 2016 అమలవుతుండగా ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదని తెలిపారు. దీని అమలుకు ఒత్తిడి చేయాలన్నారు. రుణాలు మంజూరు చేయాలని, 40 శాతం ఉన్న వికలాంగులకు రైల్వే పాసులు, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.










