ప్రజాశక్తి-యంత్రాంగం
సింహాచలం: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అడవివరం జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఆకస్మిక సందర్శించారు. విద్యార్థులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నాడు- నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ, శత శాతం ఫలితాలు సాధించేలా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం
ఆరిలోవ : ఉపాధ్యాయుల పనితీరుపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరిలోవ, తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను ఆమె సందర్శించిన సమయంలో విద్యార్థులు రోడ్లుపైనా, మైదానంలో తిరుగుతూ కనిపించారు. దీనిపై ఉపాధ్యాయులను వివరణ కోరగా ఆ సమయంలో ఉపాధ్యాయుల సమావేశం అవుతుందని సమాధానం ఇవ్వడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉంటే విద్యార్థులను చూసేందుకు విద్యార్థి లీడర్‌కు అప్పగించాలని సూచించారు. అనంతరం ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి తక్కువ మంది విద్యార్థులు రావడంపై ఆరా తీశారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు వాడుతుండడంపై ప్రత్యేక నిఘా కోసం పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.










