ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పెదకూరపాడులో పిడుగుపాటుకు పొలంలో ఉన్న రైతు గుంటూరు పోలయ్య (70) దుర్మరణం పాలయ్యాడు. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరు మిర్చి యార్డులో స్వల్పంగా మిర్చి టిక్కిలు తడిసిపోయాయి. పలు గ్రామాలు, పట్టణాల్లో పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరుపారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉండగా సాయంత్రం వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మరోవారం పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
గుంటూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరుపారింది. కాల్వలలో గత కొంతకాలంగా పూడికలు తీయకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు, వర్షం కలసిరోడ్డుపై పారింది. దీంతో పాదాచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయంలో వర్షం కురవడంతోపలువురు ఇబ్బందిపడ్డారు.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దుగ్గిరాలలో అత్యధికంగా 61.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా తుళ్లూరులో 0.4 మిల్లీ మీటర్లు కురిసిందని అధికార వర్గాలు తెలిపాయి. కొల్లిపర 55.4, తెనాలి 44.8, పెదనందిపాడు 44.2, మంగళగిరి 34.4, చేబ్రోలు 17.4, కాకుమాను 16.4, తాడేపల్లి 9.4, తాడికొండ 1.4, ఫిరంగిపురం 1.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో గతరెండు రోజులుగా ఒక మోస్తరుగా వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.
ప్రజాశక్తి కారెంపూడి : కారెంపూడి మండలంలో ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమాయమయ్యాయి. చింతపల్లి, ఒప్పిచర్ల, నరమాలపాడు, పెదకొదమగుండ్ల తదితర గ్రామాల్లో వర్షపు నీరు రోడ్లపై నిల్వ చేరింది. వర్షంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించి విద్యుత్తుకు అంతరాయం లేకుండా పనులు చేస్తున్నారు. ముందస్తు పత్తి పంట సాగు చేసిన రైతులు బోర్ల నుండి తమ పొలాలకు నీళ్లు మళ్లించడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోవడంతో వర్షం మేలు చేసిందని రైతులు చెబుతున్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : తేలికపాటి జల్లులతో ప్రజలు సేదతీరారు. భారీ ఈదురు గాలులకు ఉండవల్లిలో దేవుడి మాన్యంలో దోష యాగం కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు ఎగిరి విజయవాడ అమరావతి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రాకపోకలు జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం విఐపిలు, వివిఐపిలు, జడ్జిలు, సెక్రటరియేట్ ఉద్యోగులు, సిఎంఒ అధికారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. యాగం చేసే నిర్వాహకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తెగిన గాలిపటాల్లా రేకులు రోడ్డు మీద పడ్డాయి. ఈ గ్రౌండ్‌లోనే పదుల సంఖ్యలో పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఈ గ్రౌండ్‌ను వాకింగ్ ట్రాక్, పార్కుగా చేయాలని ఎప్పటినుంచో స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదని, యాగానికి ఎలా అనుమతిచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాశక్తిఅమరావతి : మండల పరిధిలోని దిడుగు గ్రామ సమీపంలో పంట పొలాలకు వెళ్లే కాల్వ నుండి వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అమరావతి వయా దిడుగు క్రోసూరు రోడ్డుపై నీరు ప్రవహించడం, రోడ్డుకు ఇరువైపులా మోకాళ్ల లోతు గుంతలు ఉండడంతో వాహనదార్లు భయపడ్డారు. నీరు తగ్గే వరకు అనేకమంది వాహనదార్లు నిరీక్షించారు.
ప్రజాశక్తి - వినుకొండ : పట్టణంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ కాలువలు వర్షం నీరుతో నిండి మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. అంబేద్కర్ కాలనీ, రైలుపేట, ముట్లకుంట కాలనీ, శంగార వనం, వెన్నపూస కాలనీ, హనుమాన్ నగర్, ఓబయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ పారుదల లేక మురుగునీరు రోడ్లపై చేరింది. స్థానిక విద్యానగర్లో డ్రెయినేజీ కాలవలు వర్షం నీరు నిండి నివాసాల మధ్య మురుగునీరు చేరి తటాకాలను తలపించింది. నరసరావుపేట రోడ్డులోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ప్రధాన కాల్వ వర్షం నీరుతో ప్రవహించింది. కాల్వ పారుదల లేక మురికి కూపంగా మారింది. డ్రైనేజీ మురుగునీరు పంచాయతీ రాజ్ కార్యాలయ ఆవరణలోకి చేరింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వర్షం నీరు చేరి చెరువును తలపిస్తోంది. కారంపూడి రోడ్‌లోని వెన్నెల సూపర్ మార్కెట్ వద్ద వర్షం నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి. శృంగార వనంలోని డ్రెయినేజీ కాలువలు వర్షం నీరుతో నిండి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధాన్ని వెదజల్లాయి. ఏనుగుపాలెం రోడ్డులోని ప్రధాన డ్రెయినేజీ కాల్వ నుండి శృంగారవనం కాల్వలోకి ప్రవహించాయి. డ్రెయినేజీ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.










