ప్రజాశక్తి- సీలేరు : జీకే మండలంలోని పలు పాఠశాలల్లో గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఐ.కొండలరావు శనివారం ఆకస్మిత తనిఖీలు నిర్వహించారు. తొలిత సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని, మెనూ ప్రకారం భోజనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరగతి గదులకు వెళ్లి విద్యాబోధనపై ఆరా తీశారు. డైనింగ్ హాలు డ్రిల్స్ రంధ్రాల్లోంచి కిచెన్‌లోకి కోతులు ప్రవేశించి ఆహార పదార్థాలు చిందరవందర చేస్తున్నాయని వంట కుక్కులు డీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆయన కావాల్సిన సామాగ్రి కోసం ఇంజనీరింగ్ సిబ్బందితో ఎస్టిమేట్ వేయాలని హెచ్‌ఎంను ఆదేశించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం దేవమణి, వార్డెన్ సకుంతల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో...
స్థానిక గురుకుల పాఠశాలకు శనివారం ఉదయం 6 గంటలకే డీడీ చేరుకొని తనిఖీలు నిర్వహించారు. వంటశాలలో ఆహార పదార్థాలను పరిశీలించారు. పాఠశాలలో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. పాఠశాలలో నీటి సమస్య అధికంగా ఉందని, ఓవర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని డీడీ దృష్టికి ప్రిన్సిపాల్ వెంకటరమణ తీసుకెళ్లారు. అనంతరం సీలేరు ఎంపీపీ పాఠశాలకు చేరుకొని నాడు-నేడు పనుల పురోగతిని ఉపాధ్యాయులు పుష్పరాజుని అడిగి తెలుసుకున్నారు.
దారకొండ, సప్పర్ల ఆశ్రమ పాఠశాలల్లో
దారకొండ, సప్పర్ల ఆశ్రమ పాఠశాలలను కూడా డీడీ కొండలరావు సందర్శించారు. విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలపర్చకపోతే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. పాఠాలు బోధించే ముందు లెసన్ ప్లాన్ తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. డ్రాప్ అవుట్ ఉన్న విద్యార్థులు రెండు రోజుల్లో పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నాడు నేడు పనులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో దారకొండ హెచ్‌ఎం సోమరాజు, వార్డెన్ రమేష్, సప్పర్ల హెచ్‌ఎం ఎస్.సత్యనారాయణ వార్డెన్ జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు.










