Dec 31,2022 00:09

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న 108 సిబ్బంది

ప్రజాశక్తి-మాడుగుల: నర్సీపట్నంలో ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో మండలంలోని పలువురు టిడిపి నేతలను శుక్రవారం గృహ దిగ్బంధనం చేశారు. టిడిపి మండల శాఖ ప్రధాన కార్యదర్శి, పొంగలిపాక గ్రామానికి చెందిన వుందూరు దేముడును ఆయన గృహంలో బయటకు రాకుండా కట్టడి చేశారు. మండలంలోని పలువురు టిడిపి నేతలను వారి ఇళ్ల నుండి బయటకు రానీయకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పింఛన్ల తొలగింపు, రహదారుల పరిస్థితి వంటి సమస్యలను ముఖ్యమంత్రి పర్యటనలో నేతలు ఆందోళన చేస్తారని సమాచారంతో పోలీసు శాఖ ముందస్తుగా అరెస్టు చేసింది.
నర్సీపట్నం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో నాయకులు
నర్సీపట్నంటౌన్‌:సీఎం పర్యటనలో భాగంగా పోలీసులు టిడిపి, జనసేన, సిఐటియు, సిపిఎం నాయకులను అరెస్టులు చేసి స్థానిక టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసి గొలుగొండ పోలీస్‌ స్టేషన్కు తరలించారు. వీరిలో నర్సీపట్నం మున్సిపల్‌ కౌన్సిలర్‌ దానిమిరెడ్డి మధు, కౌన్సిలర్‌ రావాడ నాయుడు, మాజీ కౌన్సిలర్‌ పైల గోవిందు, టిడిపి నాయకులు కొరుపోలు అప్పలరాజు, నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, రుత్తల కృష్ణ, నర్సీపట్నం మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరంగ స్వామి, జనసేన నాయకులు రాజాన వీర సూర్యచంద్ర, సిఐటియు నాయకులు అడిగర్ల రాజులను పోలీస్‌ స్టేషన్కు తరలించారు. సీఎం సభ పూర్తయిన తర్వాత వీరిని విడిచి పెట్టారు.
˜ఎస్‌.రాయవరం:మండలంలోని ధర్మవరం అగ్రహారం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం.అప్పలరాజును, అడ్డురోడ్డులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణలను ముందస్తుగా గడిచిన రాత్రి గృహ నిర్బంధనం చేశారు. శుక్రవారం వేకువ జామునే ఇరువురు నాయకులను ఎస్‌.రాయవరం పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పోలీసులు చట్టాలను ఉల్లంఘించి నాయకులను గృహ నిర్బందాలు, అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలపై అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని, దీనిపై ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.అనకాపల్లి జిల్లాలో మూసివేసిన ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు.మహా సంకల్ప పాదయాత్ర సందర్భంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరించి ఆదుకుంటామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారని, మూడున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా పట్టించుకోలేదన్నారు.ఇదేనా రైతులను, కార్మికులను ఆదుకోవడం అని ప్రశ్నించారు. గత 3 సంవత్సరాల నుండి కార్మికులకు జీతాలు చెల్లించలేదని, ఫ్యాక్టరీలను మూసివేయడంతో ఉపాధి లేక పస్తులతో జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి, ఆధునీకరించాలని డిమాండ్‌ చేశారు.
టిడిపి నేతల హౌస్‌ అరెస్టు
బుచ్చయ్యపేట:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుండి తెలుగుదేశం నాయకులను బుచ్చయ్యపేట పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టిడిపి చోడవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబును, తెలుగు యువత నాయకులు సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తిని వడ్డాదిలోను, పార్టీ మండల అధ్యక్షులు గోకవాడ కోటేశ్వరరావును పెదపూడి గ్రామంలోను వారివారి స్వగృహాల్లో అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
గొలుగొండ:ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం విచ్చేస్తున్న సందర్భంగా డివిజన్‌లో ఉన్న 108 సర్వీస్‌ సిబ్బంది తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతుండటంతో వీరిని ముందస్తుగా అరెస్టు చేసి గొలుగొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, చిన్న చిన్న కారణాలతో తమ తోటి సిబ్బందిని తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని, ఇలా పలు డిమాండ్లపై వినతిపత్రం తో సీఎం కలిసేందుకు వెళ్ళిన తమను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని 108 డివిజన్‌ యూనియన్‌ నాయకులు ఆరోపించారు.