Oct 03,2023 21:53

కొత్తవలస: నిఖిల్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- శృంగవరపుకోట : కొత్తవలస ప్రగతి కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల మైదానంలో నియోజకవర్గస్థాయిలో నిర్వహించిన వాలీబాల్‌, కబడ్డీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, టెన్ని కొయిట్‌, కోకో, అథ్లెటిక్స్‌, యోగ, షటిల్‌ బ్యాడ్మింటన్‌, త్రో బాల్‌ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ 14,17 బాలబాలికల పోటీలలో అన్ని విభాగాలలోను ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడాకారులు సత్తాచాటారు. ఇందులో భాగంగానే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పొట్నూరు శ్రీరాములు తెలియజేశారు. ఈ ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంగారు ఉమామేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ త్వరలో జరగబోవు జిల్లాస్థాయి పోటీల్లో కూడా పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల ఎంపికకు తర్ఫీదు నిచ్చి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు పొట్నూరు శ్రీరాములు, లోకిరెడ్డి కృష్ణ, యోగ ఉపాధ్యాయిని పొట్ట కళ్యాణిలను అభినందించారు.గంట్యాడ: మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు విజయనగరం రోటరీ క్లబ్‌ నిర్వహించిన నవోత్సవాలలో పాల్గొని జిల్లా స్థాయిలో విజయం సాధించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నవోత్సవాలలో ముగ్గురు విద్యార్థులు ప్రథమ బహుమతులను పొందారు. ఇందులో తెలుగు వైద్య పఠనాన్ని భాగవతంలోని గజేంద్ర మోక్ష పద్యాలు పై పోటీలు నిర్వహించారు. ఉన్నత పాఠశాల స్థాయిలో 10వ తరగతి చదివిన విద్యార్థి పిఎస్‌వి శేషాచార్యులు ప్రథమ స్థానం సంపాదించాడు, కళాశాల స్థాయిలో ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న డి సందీప్‌ ప్రథమ స్థానం సాధించాడు. శాస్త్ర సాంకేతిక అంశాలు అనే విషయంపై చిత్ర లేఖనంలో సిఇసి ప్రథమ సంవత్సరం చదువుతున్న డి తేజ ప్రథమ స్థానం సాధించాడు, వీరు ముగ్గురికి ఎస్విఎన్‌ లేక్‌ ప్యాలెస్‌లో రోటరీ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ ఆర్‌ సుబ్బారావు చేతుల మీదుగా ఇటీవల బహుమతులను అందించారు వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్‌ఆర్‌ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
సోంపురం విద్యార్థుల ప్రతిభ
వేపాడ: మండలంలోని సోంపురం ఉన్నత పాఠశాలకు చెందిన స్కౌట్‌ విద్యార్థులు వి రాకేష్‌, ఎన్‌ అజరు, బి. చైతన్య గత నెల 28 నుండి ఈ నెల 2 వరకు గుంటూరు గొల్లమూడుపాడులో జరిగిన సౌతర్న్‌ రీజియన్‌ పెట్రోల్‌ లీడర్‌ జాంబోరిట్‌లో పాల్గొని ప్రతిభను కనబరిచినట్లు పాఠశాల అడ్వాన్స్‌ స్కౌట్‌ మాస్టర్‌ బిపిఎ రాజు మంగళవారం తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి స్కౌట్స్‌, గైడ్స్‌ పాల్గొనే కార్యక్రమంలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన 22 మంది విద్యార్థులలో సోంపురం పాఠశాల నుండి ముగ్గురు స్కౌట్స్‌ పాల్గొన్నారని చెప్పారు. వీరు ఫస్ట్‌ ఎయిడ్‌, గాడ్జెట్స్‌, గ్లోబల్‌ వార్మింగ్‌ తదితర అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు 11 పథకాలు సాధించారని తెలిపారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపినట్లు ఆయన చెప్పారు.
వాలీబాల్‌ టోర్నమెంట్‌లో రెండో స్థానం
కొత్తవలస: ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన అండర్‌ 17 స్కూల్‌ గేమ్స్‌ వాలీబాల్‌ విభాగంలో 9 నియోజకవర్గాల మధ్య టోర్నమెంట్‌ గత నెల 29న సీతానగరం మండలంలో నిర్వహించారు. దీనిలో నియోజకవర్గం వాలీబాల్‌ అండర్‌ 17 బాలురు, బాలికలు జట్లు రెండో స్థానం సాధించారని నియోజకవర్గ ఇంఛార్జి పీడీ కె. కృష్ణంరాజు మంగళవారం తెలిపారు. వీరిని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, నియోజకవర్గ పిఇటిలు అభినందించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు నిఖిల్‌
కంటకాపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కె. నిఖిల్‌ అండర్‌ -17 రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఇంచార్జ్‌ ప్రధానోపాధ్యాయులు ఇమంది సత్యనారాయణ, పీడీ సిహెచ్‌ అమరావతి తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 6వ తేదీన పల్నాడులో జరగనున్నాయన్నారు. ఈ విద్యార్థికి పీడీ అమరావతి స్పోర్ట్‌ డ్రస్సు, వెయ్యి రూపాయలు బహుకరించారు. విద్యార్థి ఎంపిక పట్ల ఎంఇఒ- 2 బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.