Aug 31,2023 00:17

వృక్షానికి రాఖీ కడుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

ప్రజాశక్తి-విశాఖపట్నం : సెయింట్‌ జోసెఫ్‌ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు, గ్రీన్‌ టీమ్స్‌ ఎన్జీవో, ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌ ఎపి సంస్థతో కలిసి ''చెట్లను రక్షించండి ప్రచారం''లో భాగంగా బుధవారం 'వృక్షా బంధన్‌'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కె.మాణిక్య కుమారి ఆధ్వర్యాన రాఖీ పండుగ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు రైల్వే స్టేషన్‌ ఫ్లై ఓవర్‌ సమీపంలోని పురాతన మర్రి చెట్టుకు రాఖీలు కట్టారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి ఆ పరిసరంలోని చెట్లకు రాఖీలు కట్టారు. కళాశాల ఆవరణలోని చెట్లకు విద్యార్థులు, అధ్యాపకులు రాఖీలు కట్టి చెట్లను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్‌ టీమ్స్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రత్నం విద్యార్థులతో మాట్లాడుతూ, అడవి జంతువులు, పక్షులకు ఆహారం, ఆశ్రయం కల్పించే స్థానిక జాతులను పెంచడం ద్వారా నగరంలో పచ్చదనాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమం పట్ల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ షైజీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ జె.నిర్మల, గ్రీన్‌ గ్లోబ్‌ నేచర్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.