ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా దొరగూడ పంచాయతీ గొడుగురాళ్లలో బుధవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ సమీపంలో సుమారు రెండు ఎకరాలు స్థలంలో గిరిజనులు భారీ ఏర్పాట్లు చేశారు. వారి ఆచారాలకు అద్దం పట్టేలా భోగి మంటలు వేసేందుకు కర్రలతో సుందరంగా అలంకరించి వాటి మధ్యలో జెండా అని ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పలు సాంస్కృతి కార్యక్రమాలు, ఒడియా నాటకం వంటివి నిర్వహించారు. సరిహద్దు గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది గిరిజనులు తెల్లవారులు తిలకించారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భోగి మంటను వెలిగించి జెండాను ఎగరవేశారు. అనంతరం వివిధ రంగులు పూసుకుని హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ సంబరాలకు వచ్చిన యువతీ యువకులు జంటలుగా మారడం గిరిజనుల ఆచార సాంప్రదాయం.
సీలేరులో...
జీకే.వీధి మండలం సీలేరులో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు రంగులు పూసుకుని కేరింతల కొడుతూ పురవీధుల్లో నృత్యాలు చేశారు. ద్విచక్ర వాహనాలపై ఏపీ జెన్కో ఏఈ సురేష్, కాంట్రాక్ట్ కార్మికులు నాని తదితరులు మెయిన్ బజార్, ఏపీ జెన్కో కాలనీ, పురవీధుల్లో సందడి చేశారు. దుర్గా వీధిలో పలు పాఠశాల విద్యార్థులు చిన్నారులు కేరింతల కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంగులు అలముకొని నృత్యాలు చేశారు.
మోతుగూడెంలో...
మోతుగూడెం : చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో హోలీ పండగ ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్, ఏపీ జెన్‌కో విధుల్లో యువత రంగులు ఒకరికొకరు పూసుకుంటూ, కేరింతలు మధ్య పండగ చేసుకున్నారు. డీజే సౌండ్స్ మధ్య డ్యాన్సులు చేశారు. ఎంపీటీసీ వేగి నాగేశ్వరావు, వార్డు మెంబర్లు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
డుంబ్రిగూడలో...
డుంబ్రిగూడ : మండలంలో యువత బుధవారం హౌలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యువతతో పాటు చిన్నారులు వీధుల్లో ఒకరికొకరు రంగు నీళ్లు పోసుకుంటూ సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో పర్యాటకులు రంగులు పూసుకుంటూ హౌలీ పండుగను జరుపుకున్నారు.
పెదబయలులో...
పెదబయలు : మండల కేంద్రంలో యువత హౌలీ ఘనంగా నిర్వహించారు. రంగుల నీళ్లు ఒకరి పై ఒకరు సరదాగా చల్లుకున్నారు. ప్రధానంగా మహిళలు ఆదివాసీ జానపద గీతాలు పాడుతూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో రంగు నీళ్ళు జల్లు కొన్నారు.
గిరిజన సంఘం కార్యాలయంలో...
అరకులోయ :హౌలీ పండుగ పర్వదినాన అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో యువకులతో కలిసి గిరిజన సంఘం, సిఐటియు నాయకులు ఘనంగా హౌలీ సంబరాలు నిర్వహించుకున్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, హౌలీ పండుగ ప్రజల బతుకుల్లో రంగేళి పూయించాలని ఆకాంక్షించారు.ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎన్నికలు జరుగనున్నాయని ఈ ఎన్నికల్లో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులు పట్టభద్రులు ఆలోచించి డాక్టర్ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్, గిరిజన సంఘం నాయకులు కే.రామారావు, యువకులు సంతోష్, సాయి, మణికంఠ, గంగాధర్ పాల్గొన్నారు.










