Jul 11,2023 00:06

కోటవురట్టలో ప్రవహిస్తున్న ్ననీరు

ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని కొన్ని గ్రామాలలో సోమవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పది రోజులుగా విపరీతమైన ఎండవేడిమికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఇప్పటికే వరి నారుమడులు తయారు చేసుకొని వరి ఆకులు వెయ్యగా, కొన్ని గ్రామాలలో వర్షం లేక వర్షం కోసం వేచి చూస్తున్నారు. ఈ వర్షం వలన మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.
కశింకోట : కశింకోట మండలంలో సోమవారం ఉదయం నుండి ఉష్ణోగ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ఉపసమనం పొందారు.
బుచ్చయ్యపేట : సోమవారం కురిసిన భారీ వర్షంతో వరి నారు వేసిన రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. మండలంలోని పలు గ్రామాలలో గత వారం రోజులుగా రైతులు వరి విత్తనాలు వేశారు. గత రెండు రోజులుగా ఎండలు తీవ్రంగా కాయడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే సోమవారం వర్షం కురవడంతో రైతులు ఆందోళన లో వున్నారు.
బుచ్చయ్యపేట : మండలంలో పలు గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బుచ్చయ్యపేట జంక్షన్‌ నుండి పాత పోలీస్‌ స్టేషన్‌ రోడ్డు వరకు సిమెంటు రోడ్డు వేశారు. అయితే ఈ రోడ్డు కాస్త ఎత్తుగా ఉండడంతో ఇరువైపులా మట్టి ఎక్కువగా ఉండటంతో వర్షపు నీరు రోడ్డుపైన నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు మోకాళ్ళ లోతు వరకు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలువురు ద్విచక్ర వాహనదారులు వర్షపు నీటిలో పడిపోయారు. అధికారులు స్పందించి వర్షపు నీరు పారే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నాను.
కోటవురట్ల:మండలంలో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షం కురిసింది. ఈ వర్షానికి ఇటీవల రైతులు వేసుకున్న వరి నారుమడులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కురిసిన వర్షానికి ప్రధానంగా మండల కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా మండల పరిషత్తు కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ వద్ద రోడ్లపై నీరు ప్రవహిస్తుండంటతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
గొలుగొండ: మండలంలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. చిన్నపాటి జల్లులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారింది. మండలంలో కృష్ణదేవిపేట, ఏఎల్‌ పురం, లింగంపేట, కొత్తమల్లంపేట, ఆరిలోవ అటవీ ప్రాంతం, గొలుగొండ, జోగుంపేట తదితర ప్రాంతాల్లో వర్షం అధికంగా కురిసింది. భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వరి విత్తనాలు వేసి వర్షాల కోసం ఆశతో ఎదురు చూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.