ప్రజాశక్తి - కారంపూడి : మండలంలోని పేటసన్నిగండ్లలో భూమి రీసర్వే పనులను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. గ్రామ పరిధిలో 4200 ఎకరాల భూమి ఉండగా ఇప్పటి వరకు 2200 ఎకరాల్లో రీసర్వే పూర్తయినట్లు చెప్పారు. మిగతా భూమి రీసర్వేనూ త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రేషన్ వాహనాల ద్వారా గోదుమ పిండి పంపిణీని పరిశీలించారు. తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వీరలక్ష్మిపురంలో భూ రీసర్వే పూర్తయిందని, రైతులకు భూమి హక్కు పత్రాలు కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ప్రజాశక్తి - విజయపురిసౌత్ : మాచర్ల మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. అనంతరం స్థానికులకు వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఎంపిపి బి.శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి గబ్రునాయక్, ఎంపిడిఒ సరోజినిదేవి, డిప్యూటీ తహశీల్దార్ వాణి, సర్పంచ్ జయప్రకాష్‌రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వెస్లీ, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - రెంటచింతల : మండలంలోని రెంటాలలో జెడ్‌పి పాఠశాలకు సంబంధించి వివాదాస్పద స్థలాన్ని జెసి పరిశీలించారు 403 సర్వే నంబర్‌లో 2.58 ఎకరాలు ఉండాల్సి ఉండగా కొంత స్థలానికి సంబంధించి వివాదం ఏర్పడి కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన జెసి పాఠశాలలో గదులు కొరతను గమనించారు. 361 సర్వేనంబర్‌లోని గ్రామకంఠం స్థలాన్నీ పరిశీలించారు. అనంతరం డిఇఒ శామ్యూల్‌కు ఫోన్ చేసి మండల కేంద్రమైన రెంటచింతలలోనూ జెడ్‌పి పాఠశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం మెట్టుగుడుపాడులో భూముల రీసర్వేను పరిశీలించారు. జెసి వెంట తహశీల్దార్ పుల్లారావు, విఆర్‌ఒ నాసరయ్య, హెచ్‌ఎం సాగర్‌బాబు, సర్వేయర్ రాజమోహన్ ఉన్నారు.










