ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా నాడు-నేడు నిధులు రూ.28 లక్షలతో అభివృద్ధి చేసిన తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వెంకుపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రూ.19 లక్షలతో అభివృద్ధి చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని, రూ.17.30 లక్షలతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి 11 సెంట్లు స్థలం ఇచ్చిన ఆడారి రామ అప్పారావుకు వేరే చోట ఆయనకు 11 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని తహశీల్దారును ఆదేశించారు. తగరంపూడిలో నాడు-నేడు నిధులు రూ.34 లక్షలతో ఆధునికీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొర్లి సూరిబాబు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, నాయకులు మళ్ల బుల్లిబాబు, భీశెట్టి జగన్, తహశీల్దారు గంగాధర్‌రావు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈఓ దివాకర్, ఎంపీటీసీ రాపేటి వెంకటేశ్వరరావు, విల్లూరి సూర్య కుమారి చంద్రశేఖర్, తుమ్మపాల, వెంకుపాలెం, తగరంపూడి సర్పంచులు తట్ట పెంటయ్య నాయుడు, రాపేటి నాగేశ్వరరావు, యాదగిరి అప్పారావు, ఏఏంసి మాజీ చైర్మన్ మలసాల కిషోర్, కలగా గున్నయ్య నాయుడు పాల్గొన్నారు.










