ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తరచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు నుంచి వైసిపి, టిడిపి ఢ అంటే ఢ అంటున్నాయి. గతేడాది డిసెంబర్ 16న మాచర్లలో టిడిపి, వైసిపి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెల్లరేగాయి. దాదాపు మూడు నెలల పాటు మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట వినుకొండ నియోజకవర్గాల్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నా పోలీసులు ముందస్తుగా నిరోధించడంలో విఫలమవుతున్నారు.
వినుకొండలో గురువారం జరిగిన ఘర్షణలో పోలీసులు ముందస్తుగా కనీస జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టం అవుతుంది. తొలుత బస్టాండ్ వద్ద టిడిపి కార్యకర్తలు ర్యాలీ చేస్తుండగా అదే సమయంలో ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు వాహనాన్ని అనుమతించారు. ఎమ్మెల్యే అదే మార్గంలో వెళ్లాలనుకుంటే టిడిపి వారినైనా ఆ మార్గంలో అనుమతించకుండా ఉండాల్సింది. లేదా ఎమ్మెల్యేను వేరే మార్గంలో నైనా పంపాల్సి ఉంది. అలాకాకుండా రెండు గ్రూపులను ఒకే మార్గంలోకి అనుమతించడం ద్వారా పోలీసుల ఘర్షణకు ఆస్కారం కల్పించారనే విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే కారుపై టిడిపి కార్య కర్తలు రాళ్లు రువ్వారని పోలీసులు చెబుతుండగా ఎమ్మెల్యే బొల్లా మీసం మెలేసి రెచ్చగొట్టడం వల్లే ఘర్షణ జరిగిందని టిడిపి నాయకులు చెబుతున్నారు.
పల్నాడు జిల్లాలో కొన్ని నెలలుగా వైసిపి, టిడిపి కార్యకర్తలు తరచూ ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఇటీవల నరసరావుపేటలో ఘర్షణలు జరిగాయి. టిడిపి నరసరావుపేట ఇన్‌ఛార్జి అరవిందబాబుతో పాటు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్లలో టిడిపి ఇన్‌ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డి నియమి తులైనప్పటి నుంచి టిడిపి కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి, టిడిపి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ 16న టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. చివరికి టిడిపి కార్యకర్తలు ఇళ్లపై వైసిపి కార్యకర్తలు దాడి చేసి దహనకాండ విధ్వంసాన్ని సృష్టించారు. ఈ ఘర్షణలో గాయపడిన టిడిపి కార్యకర్తలను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను కూడా రానివ్వకుండా శాంతిభద్రతల సమస్యను సాకుగా చెప్పారు. మాచర్ల దాదాపు మూడు నెలల పాటు 144 సెక్షన్ కొనసాగింది. వినుకొండలో కూడా అదే రీతిలో ఘర్షణలను ప్రేరేపించి వచ్చే నెలలో జరగాల్సిన నారా లోకేష్ పర్యటన అడ్డుకోవడా నికి వైసిపి నాయకులు కొట్రలు చేస్తున్నారని మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతేడాది కాలంలో పలనాడు ప్రాంతంలో రాజకీయ వైషమ్యాలు, ఫ్యాక్షన్ తరహా దాడులు పెరుగుతున్నాయి. అయితే పోలీసులు పలు సంఘటనలో జరిగిన ఘర్షణలు, హత్యలు అన్ని వ్యక్తిగత కారణాలుగా పేర్కొంటున్నారు. వినుకొండలో తనను అంతమొందించేందుకు టిడిపి నాయకులు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు టిడిపి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో వైసిపితో ఢ అంటే ఢ అనే స్థాయికి చేరుకుంటున్నారు. ఎన్నికలకు దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు ముందే ఈ విధంగా ఘర్షణలు జరిగి శాంతిభద్రత సమస్య తలెత్తితే ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో నిఘావర్గాలకు కూడా కష్టతరమవుతోంది.










