ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా పల్నాడు జిల్లాలో మాత్రం జల్లులు, ఒక మోస్తరు వర్షం మాత్రమే పడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇంతవరకు ఆశాజనకమైన పరిస్థితి ఏర్పడలేదు.
పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 54 వేల ఎకరాల్లోనే సాగు అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 50 వేల ఎకరాల్లో పత్తి సాగవ్వగా నాలుగు వేల ఎకరాల్లో ఇతర పంటలేశారు. పల్నాడు జిల్లాలో జూన్‌లో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్లు నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకు శుక్రవారం వరకు 53 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. ఏడు మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనీస వర్షపాతం నమోదు కాలేదు. జులైలో గత 21 రోజుల్లో మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, నకరికల్లు, రొంపిచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, యడ్లపాడు అంతేగాక పలు మండలాల్లో కనీస వర్షపాతం నమోదు కాలేదు. 9 మండలాల్లో 10 నుంచి 20 శాతం వర్షం కూడా కురవలేదు. అచ్చంపేట, ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో ఈనెలలో కనీస వర్షంకు మించి వర్షాలు కురిశాయి. మిగతా 16 మండలాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. 16 మండలాల్లో 60 నుంచి 70 శాతం తక్కువగానే వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన యడ్లపాడు, చిలకలూరిపేట, మాచవరం, నాదెండ్ల, పెదకూరపాడు, సత్తెన పల్లి, అమరావతి, నరసరావుపేట, నకరికల్లు, ముప్పాళ్ల తదితర మండలాల్లో వర్షాలు ఆశాజనకంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో పత్తి సాగు ప్రారంభించారు. జులై నెలలో ఈ మండలాల్లో కూడా సరైన వర్షాలు కురవలేదు. అలాగే ఇప్పటి వరకు మిర్చి సాగుపై రైతులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
మిర్చికి ఆశాజనకమైన ధరలున్నా వర్షాభావంతో పాటు రానున్న నెల రోజుల్లో కృష్ణా ఎగువ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహం వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతేడాది జులై 20 కల్లా నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం వచ్చింది. ఈఏడాది ఎప్పటికి వరద వస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల పేరుతో గురువారం రాత్రి కాల్వలకు నీరు విడుదల చేశారు. వారం పాటు దాదాపు నాలుగు టిఎంసిల నీరు విడుదల చేస్తారని చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పల్నాడు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జల్లులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. మాచవరంలో 8.2, బెల్లకొండలో 6.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. మొత్తంగా జులైలోనెలలో 24 మండలాల్లో కనీస వర్షపాతం నమోదు కాలేదు.
గుంటూరుజిల్లాలో మోస్తరుగా వర్షాలు
గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో జల్లులతోకూడిన ఒక మోస్తరువర్షం కురిసింది. తాడికొండలో అత్యధికంగా 22.4 మిల్లీ మీటర్ల వర్షం నమోదవగా మిగతా ప్రాంతాల్లో స్వల్పవర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో జూన్ మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా 105.8 మిల్లీ మీటర్లు కురిసింది. జులైలో 164.9 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం శుక్రవారం వరకు 150 మిల్లీ మీటర్లు నమోదైంది.










