ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం హరిబాబు విలేకర్లతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌లో 5.50 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 3 లక్షల ఎకరాల్లోనే పంటలేశారని, ప్రధానంగా ఖరీఫ్‌లో పత్తి, అపరాల పంటలు వర్షాభావ పరిస్థితుల్లో సరైన ఎదుగుదల లేక దెబ్బతింటున్నాయని వివరించారు. కౌలు రైతులు ముందుగానే కౌలు చెల్లించి ఏ పంటవేయాలో అర్థమవ్వక ఆయోమయంలో ఉన్నారని చెప్పారు. వరి సాగుకు నీరువ్వలేమని నీటిపారుదల శాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో రబీలో జొన్న, మొక్కజొన్న, అపరాల సాగుకు ఆరుతడి పంటలకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం దెబ్బతిని రైతులు నష్టాలపాలైన నేపథ్యంలో బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు, ఎరువులను రాయితీపై సరఫరా చేయాలని కోరారు. మూణ్ణెల్లుగా వ్యవసాయ పనుల్లేక కూలీలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరువు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రామారావు, మండల కార్యదర్శి కె.ఆంజనేయులు పాల్గొన్నారు.










