ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇంతవరకు ఆశాజనకమైన పరిస్థితి కన్పించడం లేదు. గుంటూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా పల్నాడు జిల్లాలోని దాదాపు 20 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు సాగు పనులు ఊపందుకోలేదు. పల్నాడు జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 35 వేల ఎకరాల్లోనే సాగైంది. మిగతా పంటలన్నీ 100 ఎకరాల్లోపే సాగు చేశారు. పల్నాడు జిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకు గాను గడచిన 10 రోజుల్లో కేవలం 36.1 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంతేగాక పలు మండలాల్లో కనీస వర్షపాతం నమోదు కాలేదు.
సత్తెనపల్లి, అచ్చంపేట, ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో ఆశాజనకమైన వర్షాలు కురవగా మిగతా ప్రాంతాల్లో దాదాపు 70-80 శాతం లోటు ఉంది. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి మండలాల్లో భారీ లోటు కన్పిస్తోంది. గత నెలలో చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కురిసిన వర్షాలతో ఈ ప్రాంతాల్లో పత్తిసాగు ప్రారంభించారు. మిగతా పంటలపై రైతులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. మిర్చి సాగుకు ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. జలాశయాల్లో నీరు ఉంటేనే మిర్చి సాగుకు రైతులు మొగ్గుచూపుతారని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కొన్ని మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. దాచేపల్లిలో అత్యధికంగా 9.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో దాదాపు 22 మండలాల్లో ఈనెలలో వర్షపాతంలో ఇప్పటి వరకు భారీ లోటు కన్పిస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో జూన్ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జులైలో 164.9 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 10 రోజుల్లోనే 128.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అయితే గుంటూరు జిల్లా పరిధిలో కేవలం 200 ఎకరాల్లోనే వరి సాగైంది. పల్నాడు జిల్లాలో అనావృష్టి పరిస్థితి ఏర్పడితే తెనాలి డివిజన్‌లో వెదపద్ధతిలో వరిసాగు చేసిన ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాలను ముంచెత్తి పైరు నీటమునిగి నష్టం వాటిల్లింది.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా దుగ్గిరాలలో 78.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లిపరలో 70, మంగళగిరిలో 69, తాడేపల్లిలో 52, తాడికొండలో 43 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎక్కువ మండలాల్లో వర్షాల పరిస్థితి ఆశాజనకంగా ఉండటం వల్ల పత్తి, మినుము, పెసర, నువ్వు, జ్యూట్, జనుము పంటల సాగు క్రమంగా ఊపందుకుంటుందని వ్వవసాయశాఖ అధికారులు తెలిపారు.










