ప్రజాశక్తి -గుంటూరు జిల్లాప్రతినిధి : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండునెలలు అవుతున్నా సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 20 శాతం కూడా సాగు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలుసాగు అవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం లక్ష ఎకరాల్లోనే పత్తి, ఇతర పంటలు సాగయ్యాయి. వరి సాగు ఇంకా ప్రారంభం కాలేదు. దాదాపు 1.05 వేల ఎకారల్లో వరి సాగు అవుతుందని అంచనా ఉండగా ఇప్పటికి నీటి సరఫరాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉన్నారు.
పల్నాడు జిల్లాలో 95 వేల ఎకరాల్లో పత్తి సాగవగా మరో ఐదు వేల ఎకరాల్లో మిర్చి, ఇతర పంటలు సాగయ్యాయి. మిర్చి సాగు కూడా ఇంకా ఊపందుకోలేదు. జిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 131 మిల్లీ మీటర్లకు శుక్రవారం వరకు 106.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇటీవల కోస్తా ప్రాంతం అంతా భారీ వర్షాలు కురిసినా పల్నాడులోని పలు మండలాల్లో ఆశాజనకమైన వర్షాలు నమోదు కాలేదు. జులై నెలలో గత 28 రోజుల్లో మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, నకరికల్లు, రొంపిచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నర్సరావుపేట నిర్ణీత లక్ష్యం కంటే 30 నుంచి 40 శాతం వర్షపాతం నమోదైంది. మిగతా 20 మండలాల్లో అవసరమైన మేరకు వర్షం కురిసింది. పలు మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు ఉన్నా ఎక్కువ మంది పత్తి సాగు ప్రారంభించారు. మిర్చికి ఆశాజన కమైన ధరలు ఉన్నా ఇంకా రైతులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నీటి ఎద్దడి, తెగుళ్ల సమస్యల దృష్ట్యా మిర్చిని ఆలస్యంగా సాగు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
గుంటూరు జిల్లాలోనూ 20 శాతం
గుంటూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. కాల్వలకు నీరు వస్తోంది. అయినా సాగు వేగం పుంజుకోలేదు. గతనెలలో అనావృష్టి, ఈనెలలో అతివృష్టి పరిస్థితులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాల సాగు అంచనా ఉండగా ఇప్పటివరకు కేవలం 50 వేల ఎకరాల్లోనే వరి,పత్తి, ఇతరపంటలను సాగు చేశారు. 22 వేల ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 3 వేల ఎకరాల్లో ఇతరపంటలను వేశారు. వరిసాగుకు అధిక వర్షాలు కూడా అడ్డంకిగా మారాయి. 10 రోజుల క్రితం వేసినపత్తి కొన్ని ప్రాంతాల్లో మొలకదశలోనే పైరు దెబ్బతింది. అలాగే వెదపద్ధతిలో సాగు చేసిన వరి కూడా ఇదేరీతిలో నీట మునిగి దెబ్బతిన్నాయి. జిల్లాలో జూన్ నెలలో 97.1 మిల్లీమీటర్లకు గాను 105.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జులైలో 164.9 మిల్లీ మీటర్లకు గాను 283.5 వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 18 మండలాల్లో జులైలో అవసరానికి మించి వర్షం కురిసింది. కానీ సాగు మాత్రం జాప్యం జరుగుతోంది. వర్షం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అధిక వర్షాలు నమోదు కావడం వల్ల పొలాల్లో నీరు చేరి రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చిసాగుకు అధిక వర్షాలు ఆటంకం కలిగించాయి.










