Sep 22,2023 22:46

తాత్కాలిక కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తున్న పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కళల వల్ల సున్నితత్వం అలవడుతుందని, తద్వారా వ్యతిరేఖ భావాలు పోయి ఆశావహ దృక్పథం అలవడుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టర్‌ బంగ్లా రోడ్డులో తాత్కాలిక కళాక్షేత్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించి కళాక్షేత్రం ఏర్పాటుకు కృషి చేసిన పొన్నపాటి ఈశ్వరరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మేడలు, మిద్దెలు అభివృద్ధి కాదని, ఎక్కడైతే నైతిక అభివృద్ధి జరుగుతుందో అదే నిజమైన అభివృద్ధి అని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పినట్లు గుర్తు చేశారు. తానూ గతంలో పనిచేసిన ప్రాంతంలో రూ.5 కోట్లతో డ్యాన్స్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్నాడు జిల్లాలోనూ ఐదెకరాల్లో కళా క్షేత్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కళాక్షేత్రంలో డ్యాన్స్‌, మైమ్‌, చిత్రలేఖనం, ఇతర అనేక కళలకు అవసరమైన స్టేజ్‌, రూములు అందుబాటులో ఉంచుతామని, ఏడాది పొడవునా ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించేలా కృషి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కళాక్షేత్రం నుండి కళాకారులకు అవకాశం కల్పించేలా అనవాయితీని తెస్తామన్నారు. కళాక్షేత్రం నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశామని, అందులో ప్రభుత్వ పాత్ర ఉండేలా తాను గౌరవ అధ్యక్షులుగా , అధ్యక్షులుగా పొన్నపాటి ఈశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులుగా బి.వి.ఎ.ఆర్‌.హెచ్‌.చంద్రకళ, కార్యదర్శిగా ఎస్‌.ఎం.బాషా, సంయుక్త కార్యదర్శిగా కపలవాయి విజరు కుమార్‌, కోశాధికారిగా షేక్‌ అష్రాఫ్‌ ఆలి, సభ్యులుగా బాజీమస్తాన్‌, కృష్ణ వాసు శ్రీకాంత్‌, మోడుగల శ్రీనివాసరావు, చిలుకూరు కోటేశ్వరరావు తదితరులు ఉంటారన్నారు. కార్యక్రమములో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, తహశీల్దార్‌ ఆర్‌.వి రమణ నాయక్‌, లింగంగుంట్ల మాజీ సర్పంచ్‌, వైసిపి నాయకులు పొన్నపాటి విజరుకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇదిలా ఉండగా కళాక్షేత్రానికి కలెక్టర్‌ తన వ్యక్తిగత విరాళంగా రూ.లక్ష నూట పదహారును అందించారు.