గుంటూరు జిల్లా ప్రతినిధి: పల్నాడు జిల్లాను వర్షాభావం వెంటాడుతోంది. దీంతో ఖరీఫ్ సాగు ఈఏడాది ప్రశ్నార్ధకంగా మారింది. పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలుసాగు అవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 1.50 లక్షల ఎకరాలలో పత్తి,ఇతర పంటలు సాగు అయ్యాయి. 3.10 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అవుతుందని అంచనా వేయగా 1.36 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. గతేడాది ఇదే సమయానికి 2.65 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగడం గమనార్హం. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో మిర్చిసాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 12 వేల ఎకరాల్లోనేసాగు చేశారు. పల్నాడులో వరి నారుమళ్లుకూడా ఇంకా ప్రారంభం కాలేదు. 1.20 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 2,500 ఎకరాల్లోనే వరిసాగు చేశారు. వర్షాభావంతో రైతులు సేద్యంపై తీవ్ర అయోమయంలో చిక్కు కున్నారు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వస్తున్నా ఇంత వరకు 30 శాతం కూడాపంటలు వేయకపోవడం కరువు తీవ్రతను తెలియ జేస్తుంది. పల్నాడుజిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. జులైలో 131 మిల్లీ మీటర్లకు గాను 106.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయింది. ఆగస్టు నెలలో139.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సిఉండగా ఇప్పటి వరకు 46.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈనెలలో కనీసం 20 మిల్లీ మీటర్ల వర్షపాతం కూడా నమోదు కాకుండా మండలాల్లో శావల్యాపురం, నూజెండ్ల, నకరికల్లు, అమరావతి, వెల్దుర్తి, గురజాల, కారంపూడి ఉన్నాయి.మిగిలిన మండలాల్లో 40 శాతం వరకు వర్షపాతం నమోదు అయింది. ఈఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి పల్నాడు జిల్లా మొత్తం ఒక మోస్తరుగానే వర్షం కురిసింది. నెలలో దాదాపు 20 రోజుల పాటు వర్షాలు పడని మండలాలు మరో 10 వరకు ఉన్నాయి. దీంతో జిల్లాలో వ్యవసాయానికి ఈ ఏడాది అనువైన పరిస్థితులు లేవు. మరో వైపు సాగర్‌ఆయకట్టు పరిధిలో కాల్వలకు ఇప్పటివరకు నీరు విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదల చేస్తారోకూడా తెలియని పరిస్థితి నెలకొంది. మిర్చికి తప్పని సరిగా రెండు మూడు తడులకు నీటి అవసరం ఉంది. సాగర్ నుంచి నీరురాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సాగర్ నుంచి నీరు రాకపోవడం, వర్షాలు కూడా ఆశాజనకంగా లేకపోవడం వల్ల సాగు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆగస్టునెల ముగుస్తున్నా పల్నాడు జిల్లాలో ఇంత వరకు 40 శాతంకూడా సాగుజరగడం లేదు. శ్రీశైలంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రావడంలేదు. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా ప్రస్తుతం 93.58 టిఎంసిలు మాత్రమే నిల్వ ఉన్నాయి. సాగర్‌జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.04 టిఎంసిలు సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 153.32 టిఎంసినీరు నిల్వ ఉందని ఎగువనుంచి ప్రవాహం రాకపోవడంవల్ల సాగర్ కాల్వలకు ఇప్పట్లో నీరు విడుదల చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.










