Nov 16,2023 00:20

నీటి నిల్వలను పరిశీలిస్తున్న రవీంద్రరత్నాకర్‌

ప్రజాశక్తి - వినుకొండ : పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 195 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా మలేరియా అధికారి కె.రవీంద్ర రత్నాకర్‌ తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇవాంజలి, నవాజ్‌కుంటకు చెందిన వల్లెపు భాగ్యలక్ష్మి డెంగీతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చేరగా బాధితుల ప్రాంతాలను రవీంద్ర రత్నాకర్‌ బుధవారం పరిశీలించారు. నీటి నిల్వ డ్రమ్ములను, డ్రెయినేజీలు, నివాస గృహాలు, వెలుపలి పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వినుకొండ నుండి పనుల నిమిత్తం దర్శి వెళ్లగా అక్కడ ఇద్దరికీ డెంగీ సోకిందని తెలిపారు. నరసరావుపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా డెంగీ నమోదైనట్లు చెప్పారు. పిహెచ్‌సి, ఎంఎల్‌హెచ్‌పి కేంద్రాల్లో, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో, ల్యాబుల్లో డెంగీ నిర్థారణ పరీక్షలు లేవని, జిల్లా కేంద్రం నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో మాత్రమే డెంగీని నిర్థారించే ఎలీసా పరీక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు. పిహెచ్‌సిలో రాపిడ్‌ కిడ్స్‌ ద్వారా డెంగీ లక్షణాలను ప్రాథమికంగా గుర్తిస్తారని అన్నారు. డెంగీ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్‌ 30 వేలకు తగ్గితనే ఆస్పత్రిలో ఉండి వైద్యం పొందాల్సి వస్తుందని, ప్రైవేటు ఆస్పత్రుల్లో చెప్పే మాటలు నమ్మొద్దన్నారు. హఠాత్తుగా తీవ్రంగా జ్వరం రావడం, భరించలేని తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దులు, కనుగుడ్లు తిప్పలేని నొప్పులు ఉన్నప్పుడు మాత్రమే డెంగీ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దోమ వల్ల డెంగీ వస్తుందని, వినుకొండ పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా డెంగీ దోమ లార్వా లేదని చెప్పారు. పరిశీలనలో కె.రామాంజనేయులు, వెంకటసుబ్బయ్య, బాలస్వామి, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.