ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు చిత్ర కళా పోటీల కన్వీనర్ కట్టా కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చిత్ర లేఖనం పోటీల కరపత్రాన్ని విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా రావిపాడు రోడ్డులోని శ్రీకృష్ణ చైతన్య హైస్కూల్ (డిఆర్ అకాడమీ)లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్, నరసరావుపేట డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి కె.వేణుగోపాలరావు, పల్నాడు జిల్లా బాలిక శిశు అభివృద్ధి శాఖ (సిడిపిఒ) జిల్లా అధికారి డి.రేవతి, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్.కె ప్రసాద్ హాజరై బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. నరసరావుపేట ప్రాంతీయ పరిధిలోని ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల్లో 3 నుండి 10 వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు సబ్ జూనియర్స్ విభాగంలో గాంధీజీ చిత్రం, 6, 7, 8 తరగతుల విద్యార్థులు జూనియర్స్ విభాగంలో గాంధీజీ మత సామరస్యం ఉట్టి పడేలా గాంధీజీ చిత్రం, సీనియర్ విభాగంలో 9, 10 తరగతుల విద్యార్థులు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంశాలు ఉట్టి పడేలా చిత్రం వేయాలన్నారు. పోటీలో పాల్గొనే విద్యార్థులకు విజ్ఞాన కేంద్రం తరపున ఏ4 షీట్ మాత్రమే ఇస్తారని, మిగతా పరికరాలు విద్యార్థులే తెచ్చుకోవాలని తెలిపారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, రెండు 2 కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేయడతోపాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికీ ప్రశంశా పత్రం ఇస్తామన్నారు. విజ్ఞాన కేంద్రం కోశాధికారి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో పాటు యువత కళాకారులు తమ కళారూపాలను ఆవిష్కరింప చేసేందుకు పల్నాడు విజ్ఞాన కేంద్రం ఒక వేదిక కాబోతుందని అన్నారు. చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనేవారు 7207450369, 9246493157, 9885118116, 9949809821 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు బాగేశ్వరిదేవి, కె.రామారావు, డి.శివకుమారి, శివపార్వతి, శిరీష, మస్తాన్‌రావు, చిన్న ఓబయ్య, సాంబశివరావు పాల్గొన్నారు.










