ప్రజాశక్తి - పల్నాడు జిల్లా కరస్పాండెంట్ : అమ్మఒడి నాలుగో విడత కింద పల్నాడు జిల్లాలో 1,87,417 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.243 కోట్ల 64 లక్షల 61 వేలు జమైనట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. నగదు జమను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం ప్రాంతంలో బుధవారం ప్రారంభించగా స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వర్చువల్‌గా కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదార్లకు మెగా చెక్కును అందించారు. కార్యక్రమంలో డిఇఒ శామ్యూల్, ఇతర అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆర్థిక అంశాపై విద్యార్థి దశ నుండే పట్టు అవసరం
ఆర్థిక అంశాలపై బాల్యం, విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ సూచించారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్థిక సమీకృత, అభివృద్ధి విభాగం (ఎఫ్‌ఐడీడీ) నేతత్వంలో స్థానిక శంకరభారతిపురం జెడ్‌పి పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్ క్విజ్ పోటీ పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే క్విజ్ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఆర్థిక అంశాలపై పట్టుంటే క్విజ్ పోటీలతో పాటూ జీవితంలోనూ విజయం సాధించగలరన్నారు. కార్యక్రమంలో డిఇఒ శామ్యూల్, ఎల్‌డిఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










