Jul 11,2023 19:04

సమీక్షలో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్‌ శివశంకర్‌

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణం, అంతర్గత వంతెనల నిర్మాణం, రైల్వే గూడ్స్‌ షెడ్ల అభివృద్ధి తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా సమగ్రాభివృద్ధిపై డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆర్డినేషన్‌ మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కంపెనీలు, డీలర్లు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద ముందుగానే డబ్బులు తీసుకుని విత్తనాలు, పురుగు మందులను సకాలంలో ఇవ్వని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే కంపెనీలు, డీలర్ల లైసెన్సులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి తప్పని సరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా డీలర్లు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సాయిమార్కొండారెడ్డి, జెజి శ్యామ్‌ ప్రసాద్‌ మాట్లాడారు. జిల్లా రైల్వే శాఖాధికారి అనూష, జిల్లా రహదారులు అభివృద్ధి శాఖాధికారి పార్వతీశం, ఇతర అధికారులు, కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి తమవంత సహకరిస్తామని చెప్పారు.