ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం 45 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటికీ వెళుతున్న సిబ్బంది ప్రతి ఒక్కరికీ 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనే సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాశ్వత భవనాలను నిర్మించి నిరంతరం వీటి ద్వారా గ్రామాల్లోనే వైద్య సహాయం చేయాల్సి ఉన్నా నేటికీ ఏ ఒక్క గ్రామంలోనూ ఇవి పూర్తి కాలేదు. దీంతో పల్లెల్లో అరకొర వైద్య సేవలే దిక్కవుతున్నాయి.
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పల్లె ప్రాంత ప్రజలకు సర్కార్ వైద్యం మరింత చేరువకానుందని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. గ్రామీణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దానిలో భాగంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పినా క్షేత్రస్థాయిలో నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 350 హెల్త్ క్లినిక్‌లు మంజూరు కాగా 170 భవనాల నిర్మాణం చేపట్టారు. మిగిలినవి వివిధ కారణాలతో ప్రారంభం కాలేదు. స్థలాలు లభ్యం కాకపోవడం, స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వివాదాల్లో ఉండడం, నిధుల కొరత, చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడం వంటి సమస్యలతో విలేజ్ క్లినిక్‌ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు వేగవంతంగా జరిపేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది.
అందుబాటులోకి వస్తే...
ప్రతి 2,500 మంది జనాభాకు ఒక హెల్త్ క్లినిక్ నిర్మాణం చేస్తున్నారు. వీటి ద్వారానే గ్రామ పరిధిలో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పిహెచ్‌సికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండవు. ప్రతి క్లినిక్‌లోనూ బిఎస్‌సి నర్సింగ్ అర్హత కలిగిన మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎఎన్‌ఎంతోపాటు హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. కనీసం 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. అన్నిరకాల వ్యాక్సిన్లు దొరుకుతాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది.
సాగుతూనే ఉన్నాయి..
350 క్లినిక్‌లకు గానూ జిల్లాలో 170 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇంకా 180 భవనాల నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటివరకు కేవలం 33 మాత్రమే పూర్తయ్యాయి. 103 భవనాలు స్లాబులు వేసినట్టు అధికారులు తెలిపారు. 19 రూప్ లెవెన్ లో, 15 ఫిజికల్‌గా పూర్తయ్యాయి. ఇలా జిల్లాలో అనేక భవనాలు మూడేళ్లుగా నిర్మాణ దశలోనే కొనసాగుతుండడంతో పల్లె ప్రజలు ఆరోగ్యానికి భరోసా కరువైందనే విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఇంతకాలం గడుస్తున్నా నేటికీ ఒక భవనాన్ని కూడా ప్రారంభించలేదు. వీటి ద్వారా వైద్య సేవలు అందుతాయని భావించిన గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.










