Jul 14,2023 01:57
టిడిపి నాయకుడు సాయిబాబాను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న దృశ్యం

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మంగళవారం జరిగిన టిడిపి సంఘీభావ యాత్రలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం భట్టిప్రోలు రథం సెంటర్లో వైసిపి నాయకులు చంద్రబాబు, ఆనందబాబుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనిని పురస్కరించుకుని గురువారం భట్టిప్రోలు లో శాంతియుత నిరసనకు టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని పోలీసులు ముందుగానే భట్టిప్రోలుకు పోలీసు బలగాలు దించి ముఖ్య నాయకులను అరెస్టు చేసేందుకు పూనుకోవటంతో కార్యక్రమాన్ని పల్లెకోనకు మార్పు చేశారు. పల్లెకోనలో టిడిపి శ్రేణులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రి నాగార్జున దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జగన్మోహన్‌రెడ్డి ఖైదీ నంబర్‌ 6093 అనే ప్లకార్డులను చేతబూని వాటిని కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు పల్లెనలో ముఖ్య నాయకులైన తూనుగుంట్ల సాయి బాబాతో పాటు మరి కొంతమంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేసిన టిడిపి నాయకులను విడిచి పెట్టాలంటూ పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.