ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పల్లెకోన గ్రామంలో ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో ఆదివారం నుంచి పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ డి రామానాయుడు అఖిల భారత 31వ ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. ట్రస్టు చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు స్మారక నాటకోత్సవాలను 2009 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించి రఘుబాబు నడయాడిన ప్రాంతం పల్లెకోనలో 2010 నుంచి 2019 వరకు విర్విఘ్నంగా కొనసాగాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నాటకోత్సవాలు నిలిపివేసి 2022లో హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించి పరిస్థితులు అనుకూలించటంతో ఈ ఏడాది నుంచి పల్లెకోనలో ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి 6.30 నిమిషాలకు హైదరాబాద్ శ్రీ కళా నికేతన్ వారి ''ఎర్రకలువ'' నాటకం ప్రదర్శించారు. రచన భాస్కర్ చంద్ర, దర్శకత్వం వెంకట్ గోవాడ నిర్వహించారు. కాగా భట్టిప్రోలు మండలంతో పాటు ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నాటకోత్సవాలు తిలకించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా ఈ నాటక పోటీలు ప్రతి ఏటా ఏప్రిల్ 28 నుంచి మే1 వరకు జరిగేవని, ఈ ఏడాది నందమూరి తారకరామారావు జయంతి 28న ప్రారంభించి సినీ హీరో ఘట్టమనేని కృష్ణ జయంతి 31న ముగించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.










