రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సంరంభం ఎట్టకేలకు ముగిసింది. కరోనా కారణంగా గతేడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడి, అటు పిమ్మట ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నడుమ తారా స్థాయికి చేరిన ఆధిపత్య పోరు న్యాయస్థానాల దాకా వెళ్లిన తరుణంలో అసలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారోనన్న శషభిషలు అలముకున్నాయి. చివరికి కోర్టుల జోక్యం తదుపరి నాలుగు విడతల్లో 13 వేల పైచిలుకు పంచాయతీలకు, సుమారు 1.31 లక్షల వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి లెక్కలు, పరస్పర నిందారోపణలు ఎలా ఉన్నప్పటికీ మొత్తమ్మీద అత్యధిక పంచాయతీలలో పాలక పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఎప్పుడో తప్ప పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ సాధించడం పరిపాటి. ఈ విజయానికి వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగా పనికొచ్చాయి. ప్రత్యర్ధులపై ఒత్తిడి చేసి, వారిని పోటీ నుంచి తప్పించడం, సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఓటర్లను బెదిరించడం వంటి ఆరోపణలు అధికారపక్షంపై ఎక్కువగానే వచ్చాయి. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ పంచాయతీల్లో పాగా వేసేందుకు పాలకవర్గ పార్టీల అభ్యర్ధులు ఇబ్బడిముమ్మడిగా డబ్బు పారించడం ప్రజాస్వామ్య, గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. ధనాన్ని కుమ్మరించి పదవులు కైవసం చేసుకోవడం వనరులపై కన్నేసిన పర్యవసానమే.
ఇసుక మాఫియా, అక్రమ మట్టి అమ్మకాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం పొందాలన్న రంధి ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మైనర్ పంచాయతీల్లోనూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే పల్లెల్లో ఏ స్థాయిలో డబ్బును ప్రవహింపజేశారో తెలుస్తుంది. ఊరుమ్మడి సొత్తును కొందరు దోచుకోడానికి పంచాయతీ ఎన్నికలు మార్గం సుగమం చేసే లెక్కయితే గ్రామ స్వరాజ్యం, ఆర్థిక పరిపుష్టి వంటి నినాదాలు ఉత్తుత్తి మాటలకే పరిమితం. అర్థ కండ అధికార బలాలను తట్టుకొని కొన్ని చోట్లయినా సిపిఎం, వామపక్షాల మద్దతుదారులు, అభ్యుదయ కాముకులు గెలవడం మామూలు విషయం కాదు. ఆ విజయాలు కారు చీకటిలో కాంతిరేఖలు.
గ్రామ స్థాయి ఎన్నికలైనందున అక్కడక్కడ ముఠా కక్షలు, ఆధిపత్య పెనుగులాటలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగాలు వాటిని నిలువరించలేకపోయాయి. రాజ్యాంగం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. ఆ వర్గాల వారు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను అలంకరించారు. వారి విధులను వారే నిర్వహించుకోనివ్వాలి. అలా కాకుండా పెత్తందార్లు, ఎన్నికైన మహిళలకు బదులు పురుషులు రాజ్యాంగేతర శక్తులుగా మారి అధికారం చెలాయిస్తే రిజర్వేషన్లకు అర్ధం ఉండదు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణలు పంచాయతీలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయించాలని నిర్దేశిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వాటిని పాటించిన దాఖలాల్లేవు. కేంద్రం రాష్ట్రాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టి నిధులను బిగపడుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పంచాయతీలకు ఆర్థిక సంఘం, పన్నుల్లో వాటా, ఇతరత్రా గ్రామాలకు చెందాల్సిన నిధులను బదిలీ చేయకుండా వేరే వ్యాపకాలకు మళ్లించి అన్యాయం చేస్తున్నాయి. దాంతో పంచాయతీలు ఆలనా పాలనా కరువై కునారిల్లుతున్నాయి.
కేరళ వామపక్ష ప్రభుత్వం పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా మార్చి సర్వతోముఖాభివృద్ధికి, గ్రామాల్లో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన కావించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలో గ్రామాలు సుదీర్ఘకాలం పాటు ఎన్నికలు లేక ప్రత్యేక అధికారుల పాలన కింద మగ్గాయి. ఎన్నికలు ముగిసి కొత్త పాలక మండళ్లు కొలువు తీరుతున్న సమయంలో ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోవాలి. అత్యధిక పంచాయతీల్లో తమ మద్దతుదారుల విజయాన్ని రాజకీయ ప్రాబల్యానికే సరిపెట్టకుండా రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాల సమగ్రాభివృద్ధికి పూచీ పడాలి.










