Jun 22,2023 21:16

పలకరించని తొలకరి.. చూపులన్నీ నింగికేసి..!

రాయచోటి : ఏటా ఈ సమయానికి తొలకరి వర్షాలు పడి రైతులు దుక్కులు దున్నుకునేవారు. పంట పండాలంటే నీరు ఎంతో అవసరం. నీరు కావాలంటే వానలు కురవాలి. అలాంటి వర్షం కోసం రైతన్నలు ఎదురు చూడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. సాధారణంగా మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలో వాన జాడ కన్పించేది. తొలకరి పలకరిస్తే రైతుల్లో ఉత్సాహం ఏర్పడుతుంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడో వారమైనప్పటికీ జిల్లాలో చినుకు జాడ కన్పించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 82,589 హెక్టార్లు, వేరుశనగ సాగు చేయాల్సిన విస్తీర్ణం 47,885 హెక్టార్లు ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 52,085 క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాది 40 వేల హెక్టార్ల వరకు వేరుశనగ సాగుచేసే సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో వర్షాలు కురిస్తే తప్ప రైతులు సాగుకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. వాతావరణ శాఖ తుఫాన్‌ వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జిల్లా ప్రాంతమంతా మబ్బులకు అలుముకుంటున్నాయి. కానీ చినుకు రాలిన దాఖలాలు మాత్రం కన్పించడం లేదు. అప్పుడప్పుడూ కల్లాపు చల్లినట్లు చినుకులూ పడుతూ రైతులను ఆశావాహులుగా చేస్తున్నాయి. ఎప్పుడు వాన వస్తుందా, ఎప్పుడు పంటలు వేసుకుందామా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే మార్చి నుంచి జూన్‌ నెల వరకు వేసవి తాపం అధికం కావడం భూగర్భ జలాల అడుగంటుతున్నాయి. ఎక్కడ చూసినా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర పడినా బోర్ల కింద వచ్చే నీటితో కొందరు రైతుల మాత్రం పంటలు పండించుకొని ఊపిరి పీల్చుకుంటున్నారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలో అకాలంగా గాలులు రావడం పండిన పంట అంతా నేలకొరగడంతో రైతులు పెట్టుకున్న ఆశ అంతా ఒక్కసారి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. కొందరు రైతులు లక్షలాది రూపాయలు వెచ్చించి తమ పొలాల్లో బోర్లు వేయించుకుని అరటి పంట వేసుకున్నారు. కానీ అరటిపండ్ల తీరా చేతికి వస్తుందన్న సమయంలో ఈదురుగాలు రావడంతో అరటి నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలగా మామిడి పంటలు రైతు ఎంతో ఆశపెట్టుకొని రూ. 10 చేతికొస్తాయి అనుకునే సమయంలో ఈదురుగాలులకు మామిడిపండు దెబ్బతిని నేలరాలడంతో ఉన్న కాయలను తక్కువ ధరలకే మార్కెట్లో రైతులకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట కోసం పెట్టిన డబ్బులు చేతికందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ వేయాలంటే జూన్‌ నెలలో రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుంటారు. ఇప్పటి నుంచి జులై వరకు వేరుశనగ విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతారు. కానీ చినుకు పడకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లాలో రాయచోటి, రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి ప్రాంతాలలో ఎక్కువగా రైతులు వేరుశనగ పంట వేసేందుకు ఆసక్తి చూపుతారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న రైతాంగానికి నేటికీ వర్షాలు పడకపోవడంతో ఎదురుచూపులు చూడక తప్పడం లేదు.
వేరుశనగ సాగుకు సిద్ధం చేసుకున్నాం
ఈ ఏడాదిలో వేరుశనగ సాగు చేయడానికి పొలం దుక్కి చేసుకుని సిద్ధం చేసుకున్నాం. మూడు ఎకరాల పొలం ఉంది. గత సంవత్సరం కూడా వేరుశనగ పంటలో నష్టం వచ్చింది. ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు వస్తాయని వేరుశనగ పంట బాగా సాగవతుందని ఆశిస్తున్నాం.
- అబ్బవరం వెంకటరమణ, రైతు, అబ్బవరం, రాయచోటి.
ఆందోళన అవసరం లేదు
వర్షాలు ఇప్పుడే మొదలు అవుతున్నాయి. ఈ వారంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. వేరుశనగ విత్తనాలు ఇప్పటి నుండి జులై ఆఖరి వరకు వేసుకోవచ్చు .కావున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.