ప్రజాశక్తి-సీతమ్మధార : ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జివిఎంసి 45వ వార్డు పరిధిలో నరసింహనగర్ రైతుబజార్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొంతమంది వ్యాపారస్తుల వద్ద ప్లాస్టిక్ సంచులు ఉండటం గుర్తించి ఆయన సచివాలయం శానిటరీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో పాటుగా చిరు వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వినియోగంపై కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ నిషేధంపై రైతు బజారు వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిట్టిబాబు కాలనీ మురికివాడల్లో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ కంపా హనోక్‌తో కలిసి పర్యటించారు. పారిశుధ్య పనుల నిర్వహణపై స్థానికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరించే ''క్లాప్'' వాహనాల పనితీరుపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువులకు బదులు పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని విజ్ఞప్తి చేశారు. మనతో పాటు భావితరాలకు మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యతా మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్‌ఎల్‌జి శాస్త్రి, జోన్-5 కమిషనర్ ఆర్‌జివి.కృష్ణ, జోన్-5 సహాయక వైద్యాధికారి డాక్టర్ ఎ.రాజేష్, ఎసిపి అరుణవల్లి, కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










