Aug 03,2022 23:55

ప్లాస్టిక్‌ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్న కమిషనర్‌ లక్ష్మిశ

జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మిశ
ప్రజాశక్తి -అనందపురం
:నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను అమ్మినా, వినియోగించినా సంబంధిత దుకాణదారులకు జరిమానాలను విధించడంతోపాటు దుకాణాలను సీజ్‌ చేస్తామని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మిశ హెచ్చరించారు. బుధవారం అనందపురం జంక్షన్‌, వేములవలస మహాత్మాగాంధీ పూల మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌కు బదులు నార సంచులను వినియోగించాలన్నారు. విశాఖ నగరంలో ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం అమలులో ఉందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్లాస్టిక్‌ వాడకం అమలులో ఉందన్నారు. దీనిపై గ్రామాల్లోని అధికారులు దృష్టిసారించాలని, విస్తృత తనిఖీలు నిర్వహించి, నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై జరిమానాతోపాటు దుకాణాల అనుమతులను రద్దు చేసి సీజ్‌ చేయాలని సూచించారు
బిపి కల్లాల రోడ్‌లో దుకాణం సీజ్‌
బిపి.కల్లాలరోడ్‌లో ప్లాస్టిక్‌ కవర్ల షాపును స్థానిక గ్రామ కార్యదర్శి నర్సింగరావు ఆధ్వర్యంలో సచివాలయ బృందం సీజ్‌ చేసింది. అలాగే రూ.2,500 జరిమానాను కూడా విధించారు. సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలలో ఉన్న నేపథ్యంలో వాటి వినియోగం మానుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జివిఎంసి ఒకటో జోన్‌ అధికారి ఎస్‌.వెంకటరమణ, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బుద్ధ మహాలక్ష్మి , తహశీల్దార్‌ రామారావు, ఇఒపిఆర్‌డి ఆంజనేయులు,
మాజీ సర్పంచ్‌ కోరాడ అప్పలస్వామినాయుడు, పంచాయతీ కార్యదర్శి పి నర్సింగరావు, విఆర్‌ఒ వి.లక్ష్మి, పంచాయతీ సిబ్బంది దేవుడుబాబు పాల్గొన్నారు
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వీడండి
తగరపువలస
: ప్లాస్టిక్‌లో ప్రాణాంతకమైన రసాయనాలు వున్నాయని, కవర్లలో మనం తెచ్చిన ఆహారంలో అవి మిళితమై గ్యాస్‌ ట్రబుల్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమౌతున్నాయని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మిశ అన్నారు. అందుకే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విడనాడి, భావితరాలకు మంచి వాతావరణం కల్పించాలని,తద్వారా కీర్తిమంతులు కావాలని ఆకాంక్షించారు. బుధవారం భీమిలిలోని అనిల్‌ నీరుకొండ సైన్సు అండ్‌ టెక్నాలజీ కాలేజీలో విద్యార్ధులకు ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ నిర్మూలనను ఒక యజ్ఞంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలేజీలో ఏర్పాటుచేసిన ప్లాస్టిక్‌ బదులు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను తిలకించారు. కాలేజి విద్యార్ధులు, అనిట్స్‌ అధికారులు, సిబ్బందితో ప్లాస్టిక్‌ బదులు గుడ్డ, నార, కాగితపు వస్తువులనే వాడతామని జెడ్‌సి ఎస్‌.వెంకటరమణ ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్‌ నిషేధంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిసి(రెవెన్యూ) ఫణిరాం, జోనల్‌ కమిషనర్లు ఎ వి రమణ, బి. రాము, అనిట్స్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.